
రుణ లక్ష్యాన్ని పూర్తి చేయండి
తాండూరు: వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు నిర్ధేశించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆర్పీలు, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 600 మహిళా సంఘాలకు రూ.80 కోట్ల రుణాలను ఆగస్టు నెలాఖరుగా అందించాలన్నారు. అలాగే కొత్త సంఘాలు, వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాండూరు మున్సిపాలిటీకి 44 సంఘాల ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్థేశించడం జరిగిందన్నారు. ప్రతి సంఘంలో 5 మంది వీధి వ్యాపారుల నుంచి 20 మంది వరకు సభ్యులుగా చేర్చాలన్నారు. ఇప్పటికే 5 మంది వీధి వ్యాపారులతో 20 సంఘాలను ఏర్పాటు చేయడంపై టీఎంసీ రాజేంద్రప్రసాద్‌ను అభినందించారు. మరో 24 సంఘాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. గొల్ల చెరువు ప్రాంతంలో మొక్కలను నాటాలన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా సంఘాల ఉత్పత్తి మేళాను మూడు రోజుల పాటు ఏర్పాటు చేయాలన్నారు.
మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్