
సంజీవనిలా 108
కందుకూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ పథకం దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రమాదం జరిగి ఆపదలో ఉన్న వారికి సంజీవనిలా మారింది. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా మొదట గుర్తొచ్చేది 108. సంఘటన చూసిన ప్రతి ఒక్కరు 108కి కాల్ చేయడమే తమ మొదటి ప్రాధాన్యతగా మారింది. ఇందుకు కారణం అత్యవసర సమయాల్లో చికిత్స అందడంతో పాటు సకాలంలో క్షతగాత్రులు, రోగులను ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది.
అత్యవసర సేవలు
108 అంబులెన్స్ వాహనంలో అత్యవసర సేవలు అందించడానికి శిక్షణ పొందిన ఈఎంటీ, పైలెట్ అందుబాటులో ఉంటారు. అవసరమైన రోగులు, క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చడంతో పాటు వాహనంలోనే ప్రథమ చికిత్స అందిస్తారు. గుండె నొప్పి వస్తే ఏఈడీ పరికరం, దానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ పరికరాలు, ఆక్సీమీటర్, పురుగు మందు తాగితే కక్కించే యంత్రం వాహనంలో అందుబాటులో ఉంటాయి. ఆస్పత్రులకు తరలించే క్రమంలోనే గర్భిణులకు సుఖ ప్రసవాలు చేసిన ఘటనలు అనేకంగా ఉన్నాయి.
అందుబాటులో 33 వాహనాలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 32 అంబులెన్స్‌లు, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మరొక వాహనం సేవలు అందిస్తోంది. ఒక్కో వాహనం నిత్యం నాలుగునుంచి ఐదు ట్రిప్పులు ఘటనా స్థలం నుంచి ఆస్పత్రులకు బాధితులను తరలిస్తున్నాయి. ప్రతీ నెల ఒక్కోవాహనం దాదాపు 150 నుంచి 180 కేసుల వరకు అటెండ్ అవుతున్నాయి.
16 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకం
అత్యవసర సమయాల్లో మెరుగైన సేవలు
ఆపద్బాంధవులు 108 సిబ్బంది