
స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా
● విద్యార్థుల రవాణాలో నిర్లక్ష్యం వద్దు ● ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, వ్యాన్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ నారాయణ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించరాదని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలి ఆదేశించారు. ఫిట్‌నెస్ ఉన్న వాహనాలనే వినియోగించాలని లేకుంటే చర్యలు తప్ప వని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, కాలుష్య నియంత్రణ పత్రం, పీయూసీ) సక్రమంగా ఉండాలన్నారు. లేకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్ల చిరునామా, ఫోన్ నంబర్లు, పోలీస్ వెరిఫికేషన్ నివేదిక తప్పనిసరిగా ఉంచుకోవాలని పాఠశాలల యాజమాన్యానికి సూచించారు. డ్రైవర్ల ప్రవర్తనపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదన్నారు. నిర్ణీత వేగంతో వాహనాన్ని నడపాలని సూచించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి వాహనంలో తప్పనిసరిగా మహిళా సహాయకులు లేదా కేర్ టేకర్ ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్లను వాహనం వెలుపల స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని పాఠశాలల బస్సులు, వ్యాన్లను ఆర్‌టీఏ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. నిబంధనల ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు: ఎంవీఐ వీరేంద్రనాయక్
పరిగి: ప్రైవేటు స్కూల్ బస్సులకు అన్ని ధ్రువపత్రాలు ఉండాలని పరిగి ఎంవీఐ వీరేంద్రనాయక్ ఆదేశించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని కృష్ణావేణి టాలెంట్ స్కూల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపితే సంబంధిత పాఠశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కండీషన్‌లో లేని బస్సులను నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే విద్యార్థుల రవాణాకు వినియోగించాలని సూచించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిస్తే రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. ఆలస్యం చేస్తే సహించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడపాలన్నారు. హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్తే స్కూల్ బస్సులను నడపాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా