చంద్రగిరి: విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు ఎంతో దోహదపడతాయని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ వైకుంఠరావు పేర్కొన్నారు. శనివారం పశువైద్య కళాశాలలో నిర్వహించిన 14 ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్ అండ్ లిటరరీ మీట్ – 2026 ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అథ్లెటిక్స్ వ్యక్తిగత ఛాంపియన్‌షిప్ బాలుర విభాగంలో గరివిడి కళాశాలకు చెందిన బి.రాహుల్ కుమార్, బాలికల విభాగంలో కె.శ్రీసహితి విజేతలుగా నిలిచారు. మడకశిర పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నాఉ. క్రీడా పోటీలు వివిధ కళాశాలల మధ్య స్నేహభావం, ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినూ, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ హేమలత, వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ మాలకొండయ్య, యూనివర్సిటీ పరిశీలకులు జయచంద్ర, రాపూరు యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. మూడు రోజుల క్రీడా సంబరాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన క్రీడా కమిటీ సభ్యులు రాంబాబు నాయక్, చైతన్య కుమార్, సాంస్కృతిక కమిటీ సభ్యులు సుధీర్‌లను అభినందించారు.


