చంద్రగిరి: పోలీసు స్టేషన్‌కు వాస్తు లేదని ఓ సాధువు చెప్పిన మాటలు విని వందల ఏళ్ల నాటి భారీ వృక్షాన్ని పోలీసులు నేలకూల్చడం చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి పట్టణంలోని పోలీసు స్టేషన్ ఆవరణలో సుమారు 300 ఏళ్ల నాటి భారీ చింత చెట్టు ఉంది. ఇటీవల ఒక సాధువు భారీ వృక్షం వల్ల పోలీసు స్టేషన్‌కు వాస్తు దోషం ఉందని తెలిపినట్టు సమాచారం. వెంటనే చింత చెట్టును తొలగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ భారీ చింత చెట్టును పోలీసులు నేలమట్టం చేయడం, అక్కడి నుంచి కలపను తరలించడంపై ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో పోలీసులు మొక్కలు నాటుతారని, వాటిని సంరక్షించాలని పిలుపునిస్తారన్నారు. అలాంటి పోలీసులు వాస్తు దోషం ఉందని ఎవరో చెప్పడంతో ఎంతో మంది ఫిర్యాదుదారులకు నీడనిచ్చే భారీ వృక్షాన్ని నేలమట్టం చేయడం ఏమిటని మండిపడుతున్నారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించి, భారీ వృక్షాన్ని నేలమట్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.


