● వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రూ.9.32 కోట్లతో అభివృద్ధి ● నేడు పశువుల పాక, గడ్డివాములకు నిలయంగా ప్రభుత్వ భవనాలు ● తుడా పార్కును ధ్వంసం చేసి అక్రమంగా వరిసాగు
సాక్షి టాస్క్‌ఫోర్స్: 2019–24 మధ్య కాలంలో కందులవారిపల్లి పంచాయతీ పరిధిలోని నారావారిపల్లితో పాటు ఇతర గ్రామాలన్నీ నవరత్నాలతో కళకళలాడాయి. నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతో చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి, దానికి అనుబంధంగా ఉన్న గ్రామాల్లో రూ.9.32 కోట్లతో 87 అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, కమ్యూనిటీ హాల్, ఆర్‌ఓ ప్లాంట్, హెల్త్ సెంటర్లను నిర్మించారు. గ్రామంలో ఎక్కడా మట్టి రోడ్లు అనేవే లేకుండా సీసీ రోడ్లను నిర్మించారు. ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ భవనాలను చంద్రబాబు పాలనలో గాలికొదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ భవనాలన్నీ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు.
పశువులకు నిలయంగా..
సీఎం చంద్రబాబు బంధువులమంటూ కొందరు, అధికార పార్టీకి చెందిన మరికొంత మంది సచివాలయ భవనాన్ని పశువుల షెడ్డుగా వినియోగించుకుంటున్నారు. కమ్యూనిటీ హాల్‌ను గడ్డివాములుగా వాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1.50 లక్షలతో తుడా పార్కును అభివృద్ధి చేయగా.. సీఎంకు బంధువునంటూ మరో వ్యక్తి ఏకంగా పార్కును ఆక్రమించుకుని మరీ వరి సాగు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారులపై సైతం దౌర్జన్యానికి పాల్పడుతూ, రాజకీయంగా బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


