తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 83,235 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,745 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకలు రికార్డు స్థాయిలో హుండీలో రూ.5.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
రేపటి నుంచి తపన ఎక్స్‌పో
తిరుపతిఅన్నమయ్యసర్కిల్: తిరుపతి ప్రాచీన తపాలా బిళ్లలు, నాణేల సేకరణకు సంబంధించిన తపన ఎక్స్ పో ప్రదర్శన శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు భీమవరం చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. తిరుచానూరు రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా శ్రీ బాలాజీ కల్యాణమండపం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేకరణ కర్తలు, పరిశోధకులు, డీలర్లు, అరుదైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యాలు, కరెన్సీ నోట్లు, తపాల బిళ్లలు, ఈ ఎక్స్ పోలో ప్రదర్శించన్నుట్లు తెలిపారు.
తిరుపతిలో కృత్రిమ
అవయవాల తయారీ కేంద్రం
తిరుపతి తుడా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలో తిరుపతిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృత్రిమ అవయవాల తయారీ యూనిట్‌కు సుమారు 3వేల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుందని అంచనా వేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రష్మీరంజన్‌సేథీ బృందం రుయాసుపత్రి ఆర్థోపెడిక్ విభా గం వెనుకనున్న స్థలాన్ని, పాత మెటర్నరీ క్వార్టర్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించిందని చెప్పారు. త్వరలో ఢిల్లీ బృందం పర్యటన ఉంటుందని, అ నంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.


