●
ఫిజిక్స్ పీడించిందంటున్న విశ్లేషకులు
తిరుపతి సిటీ: రీ నీట్ పరీక్షపై లీక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో రీనీట్ పరీక్షను ఎదుర్కొలేకపోయారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానసింగా ఒత్తిడికి గురికావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రీ నీట్ పరీక్ష పేపర్ అనుకున్నంత ఈజీగా లేదని.. కష్టతరంగానే ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బయాలజీ మాత్రమే కాస్త సులువగా ఉందని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు సుదీర్ఘంగా చదివేందుకే చాలా సమయం పట్టిందని చెబుతున్నారు. కెమిస్ట్రీలో కొన్ని ప్రశ్నలు మాత్రమే మాదిరిగా ఉన్నాయని, మిగిలినవి కఠినంగా సాధారణ విద్యార్థి ఎదుర్కొలేని విధంగా ఉన్నాయని వాపోతున్నారు. మొత్తం మీద గతనెల మే 3న జరిగిన పరీక్ష కంటే ఆదివారం జరిగిన రీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కష్టమేనని నిపుణులుసైతం విశ్లేషిస్తున్నారు.
ఫిజిక్స్ కొంపముంచిందా!
ప్రధానంగా ఫిజిక్స్ విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. సుదీర్ఘమైన ప్రశ్నలు అడగడం, ఇంటర్ స్థాయికి మించి విశ్లేషణాత్మక ప్రాబ్లమ్స్‌తో ప్రశ్నలు రావడం ప్రశ్నను అర్థం చేసుకునేందుకే సమయం తీసుకునేసింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సైతం పూర్తి స్థాయిలో ఫిజక్స్ ప్రశ్నలకు సరైన సమాధానాలు పెట్టలేకపోయారని నీట్ ఎక్స్‌ఫర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బయాలజీలో మాత్రమే విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీలో సాధారణ విద్యార్థి 40శాతం, మెరిట్ విద్యార్థులు 75శాతం ప్రశ్నలను ఎదుర్కొనే స్థాయిలో ప్రశ్నలు వచ్చాయని అంటున్నారు. 2025 నీట్ ప్రశ్నపత్రంలా రీ నీట్ పేపర్ ఉందని, మార్కుల కటాఫ్ సైతం అదే స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మే 3న నీట్ బాగా రాశా
ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలని ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుని చదివాను. మే 3న జరిగిన పరీక్ష చాలా బాగా రాశాను. సీటు పక్కా అనుకుంటున్న సమయంలో పేపర్ లీకేజ్ కారణంగా నీట్ రద్దు చేశారు. ఆదివారం రీ నీట్ పరీక్షకు హాజరయ్యాను. కానీ ఫిజిక్స్ చాలా ఇబ్బంది పెట్టింది. మేలో జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రం మాదిరిగా ఉంది. – విద్యార్థిని తోరణితో తండ్రి ఎలుమలై, పుత్తూరు


