సిద్ధరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

సిద్ధరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

భాకరాపేట : సమాజాభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన వలసారెడ్డి సిద్ధరామిరెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చిన్నగొట్టిగల్లు మండలంలో నూతనంగా నిర్మించిన వలసారెడ్డి సిద్ధరామిరెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, సొంత నిధులతో కళాశాల భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడం సిద్ధరామిరెడ్డి కుటుంబం సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ సేవకు సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న సిద్ధరామిరెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వలసారెడ్డి శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ, తమ తండ్రి సిద్ధరామిరెడ్డి ప్రజా సేవనే జీవిత లక్ష్యంగా భావించారని తెలిపారు.

భూమిపూజ మాటున దౌర్జన్యం

పెళ్లకూరు: చిల్లకూరులో తమ నివాసం పక్కన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు మాటున పోలీసుల సాక్షిగా రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రాజకీయ కక్ష్యలతో గొడవలకు పురిగొల్పుతూ దువ్వూరు రాకేష్‌రెడ్డి, శిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డి, నర్రావుల లోకేష్‌నాయుడుతో పాటు పలువురు గ్రామస్తులు, వివిధ ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు తమ ఇంటి పక్కన స్థలంలో దౌర్జన్యంగా భూమిపూజ చేయడంపై బుధవారం బాధితురాలు కామిరెడ్డి ప్రభావతమ్మ స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తమ ఇంటి పక్కన ఉన్న స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా విగ్రహ ప్రతిష్ట కోసం గుంతలు తీసి భూమిపూజ చేశారని, ఇలాంటి దౌర్జన్యకారులకు స్థానిక ఎస్సై, సీఐ తమ సిబ్బందితో ప్రత్యేక మద్దతు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి పక్కన ఉన్న స్థలంలో భూమిపూజ చేసిన దౌర్జన్యకారులతోపాటు పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మటన్‌ మార్కెట్‌పై సమగ్ర విచారణకు ఆదేశం

తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మటన్‌ మార్కెట్‌లో ఇటీవల జరిగిన తనిఖీలు, దినపత్రికలలో ప్రచురించిన వార్తలను అనుసరించి సమగ్ర విచారణ జరిపి నివేదికను నాలుగు వారాలలో సమర్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఈ మేరకు త్రి సభ్య కమిటీ బుధవారం పీపీ చావిడి వద్ద నున్న మటన్‌ మార్కెట్‌ను పరిశీలించారు. మార్కెట్‌లో వ్యాపారులను విచారించి అందులో ఐదు షాపుల యజమానులపై కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు కమిటీ తెలిపింది. మిగిలిన ఏడు షాపుల యజమానులకు నాణ్యమైన మటన్‌ మాత్రమే విక్రయించాలని ఫ్రిజ్‌లో రోజు తరబడి నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెటర్నరీ డాక్టర్‌ పరీక్షలు నిర్వహించి సీల్‌ వేసిన మటన్‌ను మాత్రమే విక్రయించాలని సూచించారు. మున్సిపల్‌ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు మార్కెట్‌లో మటన్‌ క్రయావిక్రయాలు జరపరాదని హెచ్చరించారు.

టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

– 500 గ్రాముల బంగారం, కేజీ వెండి అపహరణ

తిరుపతి రూరల్‌ : తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెంకటపతి నగర్‌లో బుధవారం భారీ చోరీ ఘటన కలకలం రేపింది. టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తున్న యశోదమ్మ ఇంట్లో సుమారు 500 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలి మనవరాలు సోనియాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం మేరకు.. వెంకటపతి నగర్‌లో నివాసం ఉంటున్న యశోదమ్మ (62) ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుపతి నగరంలో షాపింగ్‌ కోసమని వెళ్లి రాత్రి 9గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ముందున్న గేటు, తాళాలను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన సుమారు 500 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితురాలు యశోదమ్మ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ సీఐ మద్దయ్య ఆచారి తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా యశోమ్మ మనవరాలు సోనియా ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం కావడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

వాషింగ్‌ మిషన్‌లో తాళం

యశోదమ్మ ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా ఇంటి ప్రధాన తలుపు తాళం బయటే వున్న వాషింగ్‌ మిషన్‌లో పెట్టడం అలవాటు. గేటు తాళం విరిచినప్పటికీ ప్రధాన తలుపు తాళం విరచకుండా లోపలికి బయటి వ్యక్తులు ఎవ్వరు ప్రవేశించలేరని గుర్తించిన పోలీసులు కుటుంబీకులను ఒక్కొక్కరిగా పిలిపించుకుని విచారణ చేపట్టారు. కుటుంబంలో అనుమానితులను ఆరా తీయగా సోనియా పేరు బయటకు వచ్చింది. ఆమెను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement