దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

● ఎనిమిది మంది అరెస్ట్‌ ● రూ.3 లక్షల నగదు, నాలుగు వాహనాల స్వాధీనం

తిరుపతి క్రైం : తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని శ్రీకాళహస్తి–తిరుపతి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–71)పై అంజిమేడు బస్‌స్టాప్‌ సమీపంలోని దీప్‌ పంజాబీ దాబా వద్ద జరిగిన రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఆర్ల శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. జూన్‌ 15న ఫిర్యాదుదారు రవీంద్రరెడ్డి అలియాస్‌ వేణు తన వద్ద ఉన్న రూ.15 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా, నిందితులు అతడిని అడ్డగించారు. అనంతరం కత్తితో బెదిరించి నగదును అపహరించడంతో పాటు అతనితో ఉన్న బాబురెడ్డిని ఇన్నోవా వాహనం నుంచి బలవంతంగా దింపివేసి పరారైనట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఏర్పేడు పోలీసులు జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్‌డీపీవో వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా జూన్‌ 23 సాయంత్రం ఏర్పేడు మండలం, నీలాద్రి అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించి కేసులోని ఏ–2 నుంచి ఏ–9 వరకు ఉన్న ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న నగదులో భాగంగా రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరానికి వినియోగించిన ఒక ఇన్నోవా వాహనం, రెండు స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లు, ఒక స్విఫ్ట్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితురాలు లకీ్‌ష్మ్‌కాంతమ్మ పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పలు జిల్లాలకు చెందిన ముఠా

దర్యాప్తులో నిందితులు కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో కొందరిపై గతంలో మోసం, దోపిడీ, దొంగతనం తదితర కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసు బృందానికి అభినందనలు

కేసును ఛేదించడంలో ఏర్పేడు సీఐ బి.శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి, కె.రవిప్రకాష్‌తో పాటు పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేసిన బృందాన్ని జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement