చంద్రగిరి: తిరుపతి ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రిజిస్ట్రేషన్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఇంచార్జి మంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బుధవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. తిరుచానూరు ప్రాంతంలో ఉన్న పాత సచివాలయ భవనాన్ని ఆధునీకరించి తాత్కాలికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా మార్చినట్లు తెలిపారు.
పారదర్శకంగా రీ సర్వే 2.0
భూముల రీ–సర్వే 2.0 కార్యక్రమంపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ, అత్యంత పారదర్శకంగా రీ–సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. తాజ్ సర్కిల్ నుంచి శ్రీనివాసపురం వాటర్ ట్యాంక్ వరకు ఏర్పాటు చేయనున్న శాశ్వత పైప్‌లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా రిజిస్ట్రార్ రామ్‌కుమార్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొన్నారు.


