తిరుమల: తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వాహనాలపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 25 వాహనాలను సీజ్ చేశారు. తిరుమల నుంచి తిరుపతికి భక్తులను తరలించే వాహనాలపై చేపట్టిన తనిఖీల్లో మొత్తం 42 వాహనాలను పరిశీలించగా, 25 వాహనాలు నిర్ణీత చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఒక్కో వాహనానికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.25 వేల జరిమానా విధించారు. నిర్ణీత చార్జీలకు మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనిస్తే సమాచారం అందించాలన్నారు.


