● విత్తు నుంచి ఎరువుల వరకు కోతలే ● పంటకు గిట్టుబాటు కలే ● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు ● వరి పండించొద్దంటూ కొత్త మెలిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దాదాపు 1.5 లక్షల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. సుమారు 3 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా వేరుశనగ, మామిడి, వరి, చెరుకు వంటి పంటలకు ప్రభుత్వం చేయూతనివ్వకుండా కోతలు పెడుతోంది. తద్వారా పంటలు సాగు చేసే రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు.
వేరుశనగ కరువే
తిరుపతి జిల్లాలో ఖరీఫ్‌లో ప్రధానంగా వేరుశనగ సాగుచేస్తారు. సాధారణంగా 34,566 హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. ఏరువాక పౌర్ణమికి ఒక్కరోజే సమయం ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు అందలేదు. మరోవైపు జిల్లాకు అవసరమైన ఎరువులతో పోలిస్తే కేవలం 13 వేల టన్నుల ఎరువులే సరఫరా అయ్యాయి. వర్షాలు వచ్చినా విత్తేందుకు కాయలు లేక, ఎరువులు లేక రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. 2024లో నష్టపోయినా వేరుశనగ పంటకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు.
ఆశలు ఆవిరి
ప్రకృతి అనుకూలిస్తే ప్రభుత్వం అండగా ఉండడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మార్కెట్ సహకరించడం లేదని రైతులు వాపోతున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో సమస్యలే ఎదురవుతుండడంతో భవిష్యత్తుపై అన్నదాత ఆలోచించాల్సి వస్తోంది. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెబుతున్న ప్రభుత్వాలు, ఆ రైతు కష్టాలను గుర్తించి తక్షణమే విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఈ ఖరీఫ్ సీజన్ తిరుపతి జిల్లా రైతులకు మరో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు కాని మామిడి
జిల్లాలో లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ముఖ్యంగా 70 వేల హెక్టార్లలో తోతాపురి పంట ఉంది. ఈ ఏడాది కిలోకు కనీసం రూ.15 ధర ఇవ్వాలని రైతులు కోరినా ప్రభుత్వం రూ.4కే పరిమితం చేసింది. జిల్లాలో ఉన్న తొమ్మిది పల్ప్ పరిశ్రమల్లో కేవలం మూడు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నాయి. కాయలను బయట అమ్ముకోలేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సింది పోయి.. రైతుల కష్టాలను గాలికొదిలేసింది.


