ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

తిరుపతి సిటీ: పాలిసెట్‌–2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆల్‌లైన్‌ విధానంలో కొనసాగుతుందని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, సమయాభావం, విద్యార్థుల సౌకర్యార్థం ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ సమయంలో అవసరమైన అన్ని ధృవపత్రాలను జాగ్రత్తగా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

మా ఊరికి బస్సు నడపండి సార్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ‘అయ్యా మా ఊరికి ఆర్టీసీ ఫ్రీ బస్సు నడపండి’ అంటూ సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఎస్‌బీఆర్‌పురం విద్యార్థులు, గ్రామస్తులు సోమవారం తిరుపతి కలెక్టరేట్‌కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి కె.మురగారెడ్డి మాట్లాడుతూ గతంలో పుత్తూరు – ఎస్‌బీఆర్‌పురం వరకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు పుత్తూరు డిపో నుంచి నడిచిందన్నారు. ఆ బస్సు సర్వీసును నిలిపివేశారన్నారు. గ్రామ సర్పంచ్‌ మణిరాజు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల పాటు ప్రత్యేక బస్సును నడిపించారని చెప్పారు. ఆయన సర్పంచ్‌ పదవీ కాలం పూర్తి కావడంతో రెండు నెలలుగా బస్సును నిలుపుదల చేశారన్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పుత్తూరుకు వెళ్లే గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బస్సు ఏర్పాటు కోసం ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. చివరకు కలెక్టర్‌కు తమ సమస్య చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చామన్నారు.

డయల్‌ యువర్‌ సీఎండీకి 54 వినతులు

తిరుపతి రూరల్‌: ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమానికి 54 సమస్యలు వచ్చినట్టు ఆ సంస్థ చైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ లోతేటి తెలిపారు. స్థానిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 54 మంది వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను వివరించారన్నారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమం ద్వారా నమోదయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు సంస్థ అధికారులు, సిబ్బంది ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. డైరెక్టర్లు పి. అయూబ్‌ ఖాన్‌, కే.గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, ఎం. మురళికుమార్‌, ఎన్‌.శోభా వాలెంటీనా, ఎం.ఉమాపతి, సిహెచ్‌ రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్‌, ఎస్‌.రమణ, జనరల్‌ మేనేజర్లు చక్రపాణి, జగదీష్‌, లత పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద బాధితుడి ఆత్మహత్యాయత్నం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, బొమ్మవరం కమ్మపల్లి గ్రామ భూ సమస్యపై తిరుపతి కలెక్టరేట్‌ వద్ద రైతు వేమన తిరుపతయ్యనాయుడు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చిట్వేల్‌ రెవెన్యూ పరిధిలో తనకున్న మూడు ఎకరాల పొలం వద్ద రోడ్డు వేసిన కారణంగా తగ్గుదలకు చేరిందన్నారు. ఎత్తు పెంచాలని పలుమార్లు మండల అధికారులకు వేడుకున్నా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ‘నీ పొలం నువ్వే ఎత్తు పెంచుకో’ అంటూ అవమానించిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారని మడ్డిపడ్డారు. ముందుగా బాధితుడు వేమన తిరుపతయ్య నాయుడు పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌ వద్దకు రావడంతోనే గుర్తించిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం సమస్య పరిష్కరిస్తామని చెప్పి అధికారులు అతన్ని శాంతింపజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement