తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలను అడ్డుకుని సవాలక్ష ప్రశ్నలతో చుక్కలు చూపించారు. కొందరి వినతిపత్రాలను తీసుకుని చదివి, వాటి విషయాలు తెలుసుకున్న తర్వాతే లోపలికి అనుమతించారు. అర్జీలు పరిశీలించే అధికారం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు మాత్రమే ఉంటుందని, గేటు వద్ద నిలబడ్డ పోలీసులకు కాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మద్దతుగా నిలిచినందుకు అరెస్ట్
తమ రిటైర్డ్‌మెంట్ డబ్బుతో కొన్న భూమిని నకిలీ రిజిస్ట్రేషన్లతో డెవలపర్స్‌కు అప్పగించేశారని, ఆ భూమిని తమకు తిరిగి ఆన్‌లైన్ చేయాలని రిటైర్డ్ ఆర్‌టీఓ ద్వారకనాథరెడ్డి, ఆయన భార్య వనజాక్షి కలెక్టరేట్‌కు వచ్చారు. వీరికి చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరాల లోకేష్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. ప్రధాన గేటు వద్ద ఆయన కారును ఆపిన పోలీసులు తన చేతిలోని అర్జీ తీసుకుని లోనికి అమతించేందుకు అభ్యంతరం తెలిపారు. ఇంతలో మరో ఎస్‌ఐ అక్కడకు చేరుకుని ఆయనపై అమర్యాదగా వ్యవహరిస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన గేటు వద్దనే బైఠాయించారు. ఆ తర్వాత అతన్ని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ తమకు అన్యాయం చేస్తున్నారని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న వారిని నిబంధనల పేరుతో వేధించడం విమర్శలకు తావిచ్చింది.
ప్రజలను అనుమానించడం దారుణం
పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి వాటిని వెంట తెచ్చుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడతారన్న అనుమానంతో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చిన ప్రతి అర్జీదారుడ్నీ అనుమనంగా చూడడం, అత్యుత్సాహంతో ప్రజలను సవాలక్ష ప్రశ్నలతో వేధించడం కనిపించింది. ‘మా సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకోవడానికి వచ్చాం. గేటు వద్ద పోలీసులకు వివరాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి?’ అంటూ పలువురు ప్రశ్నించడం కొసమెరుపు.


