వరదయ్యపాళెం: కళ్లనిండా ట్రిపుల్ ఐటీ కలలు.. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో కౌన్సెలింగ్‌కు బయలుదేరిన ఆ చిరునవ్వు ఒక్క క్షణంలో మూగబోయింది. సత్యవేడు మండలం, మాదనపాళెంకు చెందిన ఆర్.తేజస్విని పదో తరగతిలో 573 మార్కులతో మెరిసింది. పేద కుటుంబం నుంచి వచ్చినా పట్టుదలతో చదివి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. తమ బిడ్డ జీవితం మారబోతోందన్న ఆనందంతో తల్లిదండ్రులు సోమవారం కౌన్సెలింగ్‌కు బయలుదేరారు. తెల్లవారుజామున రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఆ కలల ప్రయాణం ఆగిపోయింది. ఈ ప్రమాదంలో తేజస్వినికి రెండు చేతివేళ్లు తెగిపోగా, కాలుకి తీవ్ర గాయమైంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు వెళ్లిన తల్లిదండ్రులు కూడా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
తేజస్వీనికి నేరుగా సీటు ఇవ్వాలి
ప్రభుత్వం స్పందించి కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయినా తేజస్వినికి నేరుగా కౌన్సెలింగ్ లేకనే సీటు ఇవ్వాలని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కోరుతున్నారు. దీనిపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
అనంత లోకాలకు చదువుల తల్లి
పుల్లంపేట: మండల పరిధిలోని ఉడుంవారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చదువుల తల్లి కలవకుంట్ల.యశ్విత (16) ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్‌కు వెళుతూ అనంతలోకాలకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన యశ్విత సోమవారం ఇడుపులపాయలో కౌన్సెలింగ్ ఉండడంతో తండ్రి దినకర్, సోదరి రమ్యశ్రీతో కలిసి బయలుదేరింది. కాగా ప్రమాదంలో యశ్విత మృతి చెందగా తండ్రి దినకర్‌కు కుడికాలు విరిగిపోయింది. సోదరి రమశ్రీ తలకు బలమైన గాయమైంది. ఒకే ఇంట్లో ఒకరి మరణం, ఇరువురు గాయాలతో ఆస్పత్రి పాలవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది.


