తిరుపతి అన్నమయ్యసర్కిల్: కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 409 అర్జీలు అందినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్‌నాయక్, రోస్మండ్‌తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 208 అర్జీలందడం గమనార్హం.
పాఠశాల వద్ద బెల్ట్ షాపు వద్దు
ఏర్పేడు: మండలంలోని కుక్కలగుంట పంచాయతీ, పాయల్‌సెంటర్‌లో ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న బెల్ట్‌షాపు నిర్మాణాలను ఆపించాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్ సందర్భంగా స్థానికులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రాన్ని అందజేశారు. పాయల్‌సెంటర్ ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని టీడీపీకి చెందిన వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, తాము నిలదీసినా ఖాతరు చేయలేదన్నారు. ఇక్కడ పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పట్టా లేని స్థలంలో నిర్మిస్తున్న ఈ అక్రమ కట్టడానికి ఇప్పటికే విద్యుత్ మీటర్ ఏర్పాటునకు ఎన్‌వోసీ, ప్రభుత్వ తాగునీటి కొళాయి కనెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. తమ పిల్లల శేయస్సును దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆనుకుని అక్రమ బెల్ట్ షాపు నిర్మాణాన్ని ఆపించాలని కోరారు.


