ఏర్పేడు: జూలై 1వ తేదీన జరగనున్న ఉపాధి హామీ పథకం పేరు మార్పు కార్యక్రమం సభాస్థలికి సోమవారం మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్, రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపిచంద్ అధికారులతో కలసి సోమవారం స్థల పరిశీలన చేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక, పల్లంతోపాటు శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు, రేణిగుంట మండలం ఎల్లమండ్యం సమీపంలో సభాస్థలి కోసం స్థలాన్ని పరిశీలించారు. మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం వీబీజీ రామ్‌జీగా పేరు మార్పింది. అయితే ఈ పేరు మార్పు అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం జూలై 1వ తేదీన తిరుపతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా హాజరు కానున్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణకు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో డీపీవో సుశీలాదేవి, శ్రీకాళహస్తి ఆర్‌డీవో భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా డ్వామా ఏపీడీ వరప్రసాద్, ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యం, డిప్యూటీ తహసీల్దార్ ప్రేమ్‌సాయి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో రమణకుమార్, కేకే రమణ తదితరులు పాల్గొన్నారు.


