మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని వరుసగా కేసులను నమోదు చేస్తున్నారని.. అక్రమ అరెస్టులు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలైన పార్టీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కామిరెడ్డిపై అక్రమ కేసులను బనాయించి 97 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించడం.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఆయన చేసిన తప్పానని నిలదీశారు. ఓ కేసులో బెయిలొచ్చిన వెంటనే మరో కేసులో పీటీ వారెంట్లు జారీ చేస్తూ జైల్లోనే ఉంచేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలున్నా, కనీస మానవతా దృక్పథాన్ని సైతం చూపలేదని విమర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అండగా నిలిచిన జగన్
కష్టకాలంలో సత్యనారాయణరెడ్డి కుటుంబానికి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని, స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారని తెలిపారు. న్యాయపరమైన పోరాటం కోసం మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని పంపి సాయాన్ని అందించారని చెప్పారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
ఇసుక కేసులో 27 మందిపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కామిరెడ్డి ఆరోపించారు. రీచ్‌ను ఎక్కడిచ్చారు.. ఇసుకను ఎక్కడ తవ్వుతున్నారు.. గడువు ముగిసిన చోట తవ్వకాలకు అనుమతిని ఎవరిచ్చారనే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. తనపై 16.. కాకాణిపై 20 కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇసుక, గ్రావెల్ దందాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ అలా కాకపోతే ఆరోపణలు చేస్తున్న వారు ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి కుట్రలకు బదులు చెల్లిస్తాం
ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
సత్యనారాయణరెడ్డి అరెస్ట్, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు తగిన సమయంలో ఎండగడతారన్నారు. అవరోధాలను అధిగమించి తిరిగి తమ మధ్యకు సత్యనారాయణరెడ్డి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సత్యనారాయణరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌మోహన్‌రెడ్డి, సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ శ్రేణులు, కిలివేటి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
పెళ్లకూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సైనికుడిగా కూటమి నేతలు చేస్తున్న రాజకీయ కుట్రలకు బదులుగా తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం బెయిల్‌పై విడుదలైన కామిరెడ్డి చిల్లకూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మండలంలోని 90 శాతం గ్రామాలకు తాగు, సాగునీటికి మూలాధారమైన స్వర్ణముఖినదిలో కూటమి నేతలంతా కలిసి యంత్రాలతో ఇసుక దోపిడీ చేయడాన్ని అడ్డుకున్నందుకు అక్రమ కేసులు పెట్టి, జైల్లో నిర్బంధించి, బెయిల్ మంజూరు కాకుండా పీటీ వారెంట్లు వేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. 76 రోజుల అనంతరం చివరకు ధర్మమే గెలిచిందని వెల్లడించారు. టీడీపీ సీనియర్ నేతలు గంగాప్రసాద్, నెలవల సుబ్రమణ్యం కొనసాగిస్తున్న ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీలపై ప్రశ్నించినందుకు 16 అక్రమ కేసులు పెట్టారన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని, రాజకీయ కుట్రలు చేస్తే భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ‘స్వర్ణముఖినదిని రక్షించుకుందాం–రైతులను కాపాడుకుందాం’ అనే నినాదాంతో పోరాటం కొనసాగిస్తామాన్నరు. ఆయన వెంట అనీల్‌కుమార్‌రెడ్డి, వేణుయాదవ్, సురేష్‌రెడ్డి ఉన్నారు.
పోలీస్‌స్టేషన్లంటే ప్రజల్లో భయం
ఒకప్పుడు రక్షణ కోసం వెళ్లే పోలీస్‌స్టేషన్లు.. నేడు భయాందోళనలకు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణిచేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సాయికృష్ణ లాకప్ డెత్.. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
పోరాటాన్ని కొనసాగిస్తాం
సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామని.. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కాకాణి సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.


