ఏర్పేడు: మండలంలోని రావిళ్లవారి కండ్రిగలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి లో ఆదివారం రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈనెల 14న గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గ్రామ సమీపంలోని ప్రభుత్వ అనాదీనం భూమి సర్వే నంబరు 197–1లో 4.05 ఎకరాలు భూమిలో ఉన్న ముళ్ల చెట్లను జేసీబీ పెట్టి తొలగించారు. దీనిపై సాక్షిలో ‘అదును చూసి చదును’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఏర్పేడు తహసీల్దార్ స్పందించి ఆదివారం ఆ భూమిలో వీఆర్‌వో హరితో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు.
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
రేణిగుంట: మండలంలోని గాజుల మండ్యం ఇండస్ట్రియల్ పరిధిలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం.. నిండ్ర మండలానికి చెందిన పవన్ (25) ప్రైవేట్ కంపెనీలో రేకులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై పై నుంచి కింద పడిపోయాడు. వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా కార్మికుడు మృతి చెందాడు. ఘటనపై గాజుల మండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసులో
ముగ్గురి అరెస్టు
తడ: గంజాయి అక్రమంగా కలిగి ఉన్న ముగ్గురు నిందితులను తడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు తడ మండలంలోని రాఘవరెడ్డినగర్‌కి చెందిన చిరంజీవి, పల్లెపాళెంకు చెందిన మణికంఠ, బోడిలింగాలపాడు గ్రామానికి చెందిన ఏడుమలై అనే ముగ్గురు తడ పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు గంజాయి అక్రమ విక్రయాలు జరుపుతున్నట్లు అనుమానం రావడంతో ఆదివారం పోలీసులు దాడి చేసి వీరి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
గల్లంతైన యువకుడి మృతి
వెంకటగిరి రూరల్: తెలుగుగంగ కాలువలో యువకుడు గల్లంతై మృతి చెందిన ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు కాంపాళెంకు చెందిన కరమల ప్రసాద్ (17) శనివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రసాద్‌కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా మండలంలోని జంగాలపల్లి గ్రామం వద్ద తెలుగంగ కాలువలో గల్లంతైన మృతదేహం ఉన్నట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా ప్రసాద్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి ప్రసాద్ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని చల్లపాలెం బీసీ కాలనీకి పడమర వైపున ఉన్న బహిరంగ ప్రదేశంలో ఆదివారం రూరల్ సీఐ ఇబ్రహీం సిబ్బందితో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచిరూ.1,1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు.
తిరుమలలో ఎఫ్‌ఎంఎస్ కార్మికుడిపై దాడి
తిరుమల: తిరుమలలో హెచ్‌వీసీ గెస్ట్‌హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎంఎస్ కార్మికుడు కృష్ణపై దాడి జరిగిన ఘటనపై సీఐటీయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డిశేఖర్‌పై టీటీడీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. శనివారం జీఎన్‌సీ ఎంక్వయిరీ కార్యాలయంలో కంప్యూటర్ సిస్టమ్ విభాగంలో పనిచేస్తున్న రెడ్డిశేఖర్, ఎఫ్‌ఎంఎస్ కార్మికుడు కృష్ణపై భౌతిక దాడికి పాల్పడ్డారని సుబ్రమణ్యం ఆరోపించారు. ఒకవేళ కార్మికుడు తప్పు చేసి ఉంటే, సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో చట్టబద్ధంగా వ్యవహరించాల్సిందిపోయి దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రశ్నించారు.


