తిరుపతి సిటీ, తిరుపతి తుడా: నగరంలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు మాంసాహార, చేపల మార్కెట్లపైన, హోటళ్లపైన దాడులు చేయడంతో పెద్ద సంఖ్యలో కుళ్లిన మాంసం, చికెన్, పురుగులు పట్టిన చేపలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నగరవాసులు రెండు వారాల నుంచి నాన్ వెజ్ తినాలంటేనే జంకుతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగనటువంటి మాంసాహార ప్రియులు సైతం నాన్‌వెజ్ వైపు ముఖం చాటేసే స్థితికి చేరింది. దీంతో నగర ప్రజలు నాణ్యమైన తాజా మటన్, నాటుకోళ్ల కోసం నగరానికి సమీపంలోని పల్లెలకు క్యూ కడుతున్నారు. సమీపంలోని ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద దొరికే చేపల కోసం పల్లెదారి పడుతున్నారు. ఆదివారం చాలా వరకు నగరంలోని మటన్, చికెన్, చేపలు విక్రయించే మార్కెట్లలోనూ, నాన్‌వెజ్ ఆహారపదార్థాలు విక్రయించే హోటళ్లలో జనసందడి కాస్త తగ్గినట్లు కనిపించింది.
పల్లెల్లో మోసం ఉండదు
మాంసం విక్రయాల విషయంలో తిరుపతిలో దారుణమైన ఘటనలు బయటపడుతున్నాయి. ఇక్కడ కొనాలంటేనే ఒళ్లు జలధరిస్తోంది. అందుకే ఆదివారం కావడంతో 10 కిలోమీటర్ల సమీపంలో ఓ పల్లెలో తాజా మటన్ విక్రయిస్తుంటే అక్కడి వెళ్లి తీసుకొచ్చా. అక్కడ నాణ్యమైన మటన్ దొరుకుతుంది.
– రామకృష్ణారెడ్డి,
రిటైర్డ్ టీచర్, తిరుపతి


