ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదలు | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదలు

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

ధ్రువపత్రాల జారీలో కళాశాల

యాజమాన్యాల మెలిక

పెండింగ్‌లో 9 విడతల

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ముందు ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు

అంటున్న కళాశాలలు

పేరుకుపోతున్న బకాయిలు..

మూతపడనున్న పలు కళాశాలలు

తిరుపతి సిటీ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, పలు యూజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అందకపోవడంతో తమకు ధ్రువపత్రాలను కళాశాల యాజమాన్యాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని, పెండింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లేనిపక్షంలో ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలుకాదనే సంకేతాలు విద్యార్థులకు పంపుతున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్పుల బాట పడుతున్నారు. బాబు సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు

నూతన అడ్మిషన్ల విషయంలో 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు ఉంటాయని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తుందనే నమ్మకం లేక, స్వతహాగా ఫీజులు చెల్లించలేక ఇంటర్‌తోనే చదువు నిలిపేసి ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

47వేల మంది విద్యార్థులకు శాపం

చంద్రబాబు సర్కార్‌ వ్యవహార శైలితో జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన దాదాపు 47,360 మంది విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌, పలు రకాల వైద్య విద్యలో యూజీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లిస్తేగాని హాల్‌ టిక్కెట్లు ఇవ్వమని బెదిరించడంతో తల్లిదండ్రులు చేసేదిలేక అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది. జిల్లాలో సుమారు 47వేల మంది పేద విద్యార్థులు ఈ ఏడాది ఫీజు పరిస్థితి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

మూతపడనున్న పలు కళాశాలలు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అందకపోవడంతో పలు ప్రైవేటు కళాశాలలు మూతపడనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం డిగ్రీ, ఇంజినీరింగ్‌, పలు రకాల వైద్య విద్యతో పాటు టెక్నికల్‌ కోర్సులను అందిస్తున్న ప్రైవేటు కళాశాలు 108 ఉండగా అందులో సుమారు 24 కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కో కళాశాలకు సుమారు రూ. 4.10 కోట్లు బకాయిలు తొమ్మిది విడతలుగా నిలిచిపోయాయి. గత ఏడాది పలు మార్లు ప్రభుత్వానికి తమ సమస్యను కళాశాల యాజమాన్యాలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కళాశాలలను నడపలేమని,అధ్యాపకుల జీతాలు, కళాశాల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 11 కళాశాలలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

జిల్లాలో యూజీ పూర్తిచేసిన విద్యార్థులకు తప్పని తిప్పలు

జిల్లాలో విద్యారంగం అస్థవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలో ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పై నమ్మకం పెట్టుకోవద్దని తేల్చిచెబుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువును నిలిపివేసే పరిస్థితిలో ఉన్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరికొంత ఫీజు చెల్లించలేక సాధారణ ప్రభుత్వ కళాశాలలోనూ, దూర విద్య కేంద్రాలో యూజీ కోర్సులలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు తిరగబడుతున్నాయి. ఈ ఏడాది మా అబ్బాయిని డిగ్రీ చేర్చేందుకు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లాం. ఎస్సీ రిజర్వేషన్‌ ఉందని చెప్పాం. ఫీజు ముందు చెల్లిస్తేనే ప్రవేశాలు ఇస్తామని తేల్చిచెప్పారు. – కుట్టెమ్మ, ఓ విద్యార్థి తల్లి, తిరుపతి

ధ్రువపత్రాలు ఇస్తారో లేదో..

మా అబ్బాయి చంద్రగిరి లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది బీటెక్‌ పూరైంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో ఫీజు చెల్లించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. అప్పులు చేసి ఏడాది ఫీజు చెల్లించాం. ప్రభుత్వం ఈ ఏడాది చెల్లించకపోతే ధ్రువపత్రాలు ఇస్తారనే నమ్మకం లేదు.

– సరస్వతమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement