థర్డ్‌ పేజ్‌ అడ్మిషన్ల మెరిట్‌ లిస్ట్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

థర్డ్‌ పేజ్‌ అడ్మిషన్ల మెరిట్‌ లిస్ట్‌ విడుదల

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్‌ కళాశాలల్లో మూడో విడత ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు సంబంధించి మెరిట్‌ లిస్టును అధికారులు ఆదివారం విడుదల చేశారు. రెండు దశలలో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలలో ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 275 మంది అడ్మిషన్లు పొందగా మిగిలిన 517 సీట్లు, పద్మావతి జూనియర్‌ కళాశాలలో 443 మంది ప్రవేశాల పొందగా మిగిలిన 525 సీట్లకు ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న మూడవ విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. అనంతరం స్పాట్‌ అడ్మిషన్లు కంటే నాల్గొవ విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపడతే మెరిట్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

పంచాయతీ

కార్యదర్శి అదృశ్యం

ఏర్పేడు: మండలంలోని ఆమందూరు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్‌కుమార్‌రాజు ఈనెల 8వ తేదీ నుంచి అదృశ్యమై విధులకు హాజరుకావడం లేదు. ఎంపీడీవోకు ఎలాంటి సమాచారం తెలపకుండా విధులకు డుమ్మా కొట్టారు. అతడి ఫోన్‌ కూడా పని చేయకపోవడంతో తాత్కాలికంగా నచ్చనేరి కార్యదర్శి వెంకటమునిని ఆమందూరు పంచాయతీకి ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన ఇంటి వద్ద ఉన్నారా..? ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆస్పత్రిలో ఉన్నారా..? మరెక్కడికై నా వెళ్లిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది. ఆమందూరు కార్యదర్శి వ్యవహారంపై ఇప్పటికే డీపీవో సుశీలాదేవికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో తరచూ ప్రజలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు.

ఆర్యవర్క్‌, ఫాబ్రిక్‌

పెయింటింగ్‌పై శిక్షణ

చంద్రగిరి: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 29వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు మహిళలకు ఆర్యవర్క్‌, ఫాబ్రిక్‌ పెయింటింగ్‌పై పూర్తి ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్‌ , రేషన్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఒంటరి ఏనుగు దాడిలో రైతుకు గాయాలు

భాకరాపేట: ఒంటరి ఏనుగు దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దేవరకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మైలవండ్లపల్లి గ్రామానికి చెందిన సి. లక్ష్మయ్య శనివారం రాత్రి కోటకొండ వెంకటమునితో కలిసి పొలం వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒంటరి ఏనుగు వారిపై దాడి చేసింది. ఈ దాడిలో రైతు సి.లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కాలు విరిగిపోయింది. కేకలు విన్న గ్రామస్తులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

నీట్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

తిరుపతి క్రైం : జిల్లాలో నిర్వహించిన నీట్‌ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలను ఆదివారం ఎస్పీ సుబ్బరాయుడు తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై ఆయన కీలక సూచనలు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement