తిరుపతి సిటీ: జిల్లాలో యూజీ నీట్ రీ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలలో ఒకరిద్దరు మినహా విద్యార్థులు చాలా వరకు పరీక్షా సమయానికి ముందే చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ అధికారులు విద్యార్థులను పరిశీలించి పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం 11గంటల నుంచి విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం ప్రారంభించి మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేశారు. 2గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5.15వరకు కొనసాగింది. పలు పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
89.97శాతం హాజరు
జిల్లాలో ఆదివారం జరిగిన రీ నీట్ పరీక్షకు 89.97శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 9 పరీక్షా కేంద్రాలలో 4556మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 4099మంది హాజరయ్యారయారని, 457మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ జరిగిన నీట్ పరీక్షకు 97.2శాతం మంది హాజరుకాగా రీ నీట్‌కు సుమారు 7శాతం హాజరు తగ్గినట్లు తెలుస్తోంది.
విద్యార్థులను జల్లెడ పట్టేశారు...
నీట్ పరీక్షలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే పరీక్షకు హాజరైన విద్యార్థులను జల్లెడ పట్టారు. ఎస్వీ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలలో ఒక నిమిషం తేడాతో ఆలస్యంగా రావడంతో విద్యార్థిని అనుమతించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రీ నీట్ పరీక్ష పేపర్ అనుకున్నంత ఈజీగా లేదని కష్టతరంగానే ఇచ్చారని పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.


