తిరుపతి అన్నమయ్యసర్కిల్: తాజాగా కొందరు చేస్తున్న ట్రోల్స్‌కి తాను భయపడనని.. అసత్య ప్రచారాలతో ఏమీ సాధించలేరని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాజకీయంగా విబేధించడం, సమర్థించడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఉన్నతమైనటువంటి సాంప్రదాయం కూడా. మనకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేసే వారి పట్ల అసహజమైన, అనైతికమైన దాడి హీనమైన చర్య. శుక్రవారం న్యాయవాదిగా, రాజకీయ విశ్లేషకులుగా గుంటూరు కేంద్రంగా ఉంటున్న రజిని వ్యక్తిగత పనుల నిమిత్తం తిరుపతికి విచ్చేశారు. వ్యక్తిగతంగా నేను వారితో అనేక డిబేట్లో సహచర ప్యానలిస్టుగా పాల్గొన్నాను. పలు అంశాల్లో వారితో విబేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పరిచయంతో వారు తిరుపతికి వచ్చిన సందర్భంగా మా ఇంటికి వచ్చారు. అదే సమయంలో వారిని కలవడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా వచ్చి పలురించి వెళ్లారు. మా ఇంటికి ప్రజా జీవితంలో ఉన్నవారు ఎవరు వచ్చినా ఆ మంచి సందర్భాన్ని నా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం నా అలవాటు. నేను షేర్ చేసిన ఫొటోలను ఉపయోగించుకుని మేమేదో రహస్య సమావేశం అయినట్టు.. ఒక పార్టీకి అనుకూలంగా రాజకీయ విశ్లేషణ చేయాలని వ్యూహం పన్నినట్లు, అభ్యంతరకర భాషతో సంస్కారహీనమైన వ్యాఖ్యలతో కొందరు పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా.. ట్రోల్స్‌తో మీరు సాధించేది శూన్యం. అసత్య ప్రచారాలకు భయపడే వ్యక్తిని నేను కాదు. నా అభిప్రాయాలతో విబేధించి సరైన సమాచారంతో తప్పు పడితే నేనే తప్పును ఒప్పుకుంటాను. మీ వెనకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టే ఇతరులకు రాజకీయ పార్టీల ముద్రను వేసే స్థాయికి దిగజారుతున్నారు’’ అని విమర్శించారు.


