ఆ భూములు మావే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దళితులు, పోలీసుల మధ్య వాగ్వాదం తాటితోపులో తీవ్ర ఉద్రిక్తత వివాదాస్పద భూమి వద్ద కొనసాగుతున్న పోలీసుల పికెటింగ్
ఎమ్మెల్యే నాని అండతోనే
తిరుపతి రూరల్: ‘మా భూమిని స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకుని సహకారం, ఎమ్మెల్యే పులివర్తి నాని అండతో చెర్లోపల్లికి చెందిన వడ్లమూడి రామచంద్రనాయుడు కుమారుడు చంద్రశేఖర్ నాయుడు ఆక్రమించుకున్నారు. ఆ భూమి విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, వాటిని అమలు చేయని అధికార యంత్రాంగం ఆక్రమణదారులకు అండగా వ్యవహరిస్తోంది’ అని బాధిలు ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల గ్రామ పంచాయతీ, అరుందతీవాడకు చెందిన జంపాల నాగయ్య కుటుంబం శుక్రవారం తాటితోపులో ఉన్న తమ భూమి వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. వారిని అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీంతో దళితులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ తాటితోపు సమీపంలో చెర్లోపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నం.243/3లో 2.48 ఎకరాల దరఖాస్తు పట్టా భూమి ఉందన్నారు. తమ ఆధీనంలో ఉన్న ఆ భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా దళితులమైన తమను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. తమ తాతాల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూమి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం వెనుక ఎమ్మెల్యే పులివర్తి నానీ హస్తం ఉందని బాధితులు ఆరోపించారు. ఆ భూములు తమవని.. కోర్టుకూడా గుర్తించిందన్నారు. ఇప్పుడు అధికారులు కాదని చెబుతూ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూడడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదన్నారు. వివాదస్పద భూమి వద్ద పోలీసులు మాత్రం పికెటింగ్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నారు.
తిరుపతి ఆర్డీఓ, పోలీసులపై ఫిర్యాదు
దళితుల సాగు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని అడ్డగోలుగా ఆక్రమించడానికి వచ్చిన కబ్జాదారులకు అధికారులు, పోలీసులు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారని తిరుపతి ఆర్డీఓ, పోలీసు అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసినట్టు బాధిత దళిత కుటుంబీకులు వెల్లడించారు. కోర్టులో కేసు నడుస్తున్న భూమికి ఏకపక్షంగా ఒక వ్యక్తికి పోలీసు రక్షణ కల్పించే అధికారం ఆర్డీఓకు ఎవరిచ్చారు? పోలీసు రక్షణ కల్పించాల్సి వస్తే హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలే కానీ అధికారులు ఎలా ఆ నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నించారు.
పోరాడుతాం
మా తాతల కాలం నుంచి వచ్చిన భూమిని కాపాడుకోవడానికి ఎంతకై నా తెగిస్తాం. ఎంత మంది వచ్చినా ఆ భూమిని వదులుకునేది లేదు. ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు ఆ భూమిపైనే ఉంది. మాకు న్యాయం చేయాలి.
– వి.రాజేశ్వరి, బాధితురాలు
ఇది రాక్షస పాలన
1946లో మాకు డీకేటీ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించ లేదు. దళితుల భూములను లాక్కుని పెద్దలకు అప్పగించే దుస్థితిని ఇప్పుడే చూస్తున్నాం. ఎమ్మెల్యే పులివర్తి నాని హస్తం ఉండడం వల్లనే పోలీసులు ఇంతలా దౌర్జన్యం చేస్తున్నారు. ఇది న్యాయపాలనా..? రాక్షస పాలనా..?.
– గంగయ్య, బాధిత కుటుంబీకుడు, పుదిపట్ల
మాకు కడుపు మంట మిగిల్చారు
దళితులమైన మా భూమిని లాక్కుని మాకు కడుపు మంట మిగిల్చారు. కోట్ల విలువైన భూమిని అడ్డంగా కొట్టేయాలని అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూమిలోకి దిగారు. న్యాయ స్థానం చుట్టూ తిరిగి ఆ భూమి మా దేనని నిర్ధారించుకున్నా ఈ దుర్మార్గపు ప్రభత్వంలో మాకు అన్యాయమే జరుగుతోంది.
– జె.రమ్య, బాధితురాలు
కబ్జాదారులకు ఎమ్మెల్యే
నాని అండ
దళిత వర్గానికి చెందిన పేదలకు అన్యాయం జరుగుతుంటే కబ్జాదారులకు ఎమ్మెల్యే నాని, పోలీసులు అండగా నిలిచారు. పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయడం లేదు. ఎమ్మెల్యే నాని అర్డర్ ముందు హైకోర్టు ఆర్డర్ పనికిరాకుండా పోయింది.
– నల్లయ్య, బాధితుడు


