వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మొన్న ఎకై ్సజ్, నిన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయాలు తరలివెళ్లగా.. నేడు సబ్ జైలును చిత్తూరుకు తరలించేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలును మూసివేయడంతో ప్రభుత్వ పాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఈ నెల 15 నుంచి అధికారికంగా సత్యవేడు సబ్ జైలును మూత వేశారు. శిథిలభవనం, భద్రతా లోపాల పేరుతో జైలుకు తాళం వేశారు. జైలులో ఉన్న ఏడుగురు రిమాండ్ ఖైదీలను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. 33 ఏళ్ల పాటు సత్యవేడులో కొనసాగిన సబ్ జైలును చంద్రబాబు ప్రభుత్వం మూత వేయడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిథిల భవవాన్ని బాగుచేయలేక..
జైలు భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు దెబ్బతిందని సాకులు చెబుతున్న అధికారులు, గత రెండేళ్లుగా ఆ భవనం మరమ్మతులకు నిధులు కేటాయించలేకపోయారు. ప్రజాధనంతో కొత్త భవనం నిర్మించడం చేతగాక, ఉన్న జైలును మూసేసి చేతులు దులుపుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, పిచ్చాటూరు మండలాల ప్రజలు ఇకపై చిన్న కేసులకూ చిత్తూరు చుట్టూ తిరగాల్సిన దుస్థితి. అంతేగాక జైలులో ఉన్న ఖైదీలను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు వెళ్లాలన్నా ఇకపై 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే.
పోలీస్ శాఖకు గుదిబండ
సబ్ జైలు మూతతో పోలీస్ శాఖపై విపరీతమైన భారం పడనుంది. ఇప్పటికే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీసులు, ఇక ఒక్కో ఖైదీ కోసం ఇద్దరు చొప్పున రిమాండ్‌కు తరలించే సమయంలో చిత్తూరు వెళ్లాల్సి ఉంది. డిప్యూటేషన్ల పేరుతో సిబ్బందిని ఇతర చోట్లకు పంపి, ఇక్కడ శాంతిభద్రతలను గాలికొదిలేశారు.
మౌనం వెనుక మతలబేంటి?
సబ్ జైలు మూసివేతపై స్థానిక ఎమ్మెల్యే గానీ, అధికార పార్టీలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌గా ఉన్న నేతగానీ, అధికార పార్టీ నేతలు గానీ నోరు మెదపలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడం, కొత్త భవనం కట్టించడం చేతకాలేదు.
ఆర్టీసీ డిపోనీ మూసేస్తారా?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సత్యవేడు కేంద్రంగా ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఇప్పటికే ఎకై ్సజ్ శాఖ కార్యాలయాన్ని నాగలాపురానికి, వాణిజ్య పన్నుల శాఖను పుత్తూరుకు తరలించారు. ఒకప్పుడు కళకళలాడిన తెలుగుగంగ ప్రాజెక్టు డీఈ కార్యాలయాన్ని కుదించి ఏఈతో సరిపెట్టారు. ఇప్పుడు సబ్ జైలు కూడా పోయింది. త్వరలో ఆర్టీసీ డిపోను సైతం మూత వేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దిశగా అటు చైన్నె, బెంగళూరు, చిత్తూరు సర్వీసులను ఒక్కొక్కటిగా కుదిస్తూ వస్తున్నారు.
గెలిచాక మొండి చేయి
ఎన్నికలు వచ్చినప్పుడు అభివృద్ధి మంత్రం జపించే నాయకులు, గెలిచిన తర్వాత సత్యవేడును పూర్తిగా విస్మరించారు. ఉన్న సంస్థలను కాపాడుకోలేని వీళ్లు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకొస్తారని ఎలా నమ్మాలి?. ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తున్న పాలకుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


