గంజాయి టెస్ట్‌లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి టెస్ట్‌లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

తిరుపతి క్రైం : గంజాయి టెస్ట్‌లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తిరుపతి నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌లో 300 మంది విద్యార్థులకు బయో–చెక్‌ కిట్ల ద్వారా గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈస్ట్‌, వెస్ట్‌, అలిపిరి, ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఆ ఇద్దరు విద్యార్థులకు నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972 (ఈగల్‌) లేదా 112కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

బైక్‌ను ఢీకొన్న లారీ

ద్విచక్ర వాహనదారుడి మృతి

చంద్రగిరి: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, పనపాకం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం, తనపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రమేష్‌(37) కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనులు ముగించుకుని పాకాల నుంచి చంద్రగిరి వైపు వస్తున్న క్రమంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ పనపాకం సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్‌ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో, పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీ డ్రైవరు జావీద్‌ బాషాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సచివాలయ ఉద్యోగి అరెస్టు

నాయుడుపేట టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని భరత్‌నగర్‌ సచివాలయ పరిధిలో అడ్మిన్‌గా పనిచేస్తున్న విజయరామయ్యపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒట్టు విజయరామయ్యను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్‌ విధించినట్లు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. విజయరామయ్య భరత్‌నగర్‌ సచివాలయ సమీపంలో ఓ వివాహితతో సఖ్యత పెంచుకుని తరచూ ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఆ మహిళ లేని సమయంలో ఆమె కుమార్తె స్నానం చేస్తుండగా ఎవరికీ తెలియకుండా వీడియోలు తీసి బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా గుర్తించినట్లు సీఐ వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సచివాలయ అడ్మిన్‌ను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement