తిరుపతి లీగల్: శేషాచలం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మాటకనురు గ్రామానికి చెందిన రామన్ దొరై రాజుకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... 2019లో ఎర్రచందనం అక్రమ నిరోధక దళం పెరుమాలపల్లి బీట్, టీఎన్ పాలెం సెక్షన్, ఎస్విఎన్ పి రేంజ్, తిరుపతి డివిజన్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నిందితుడు రామన్ దొరై రాజు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలు తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఫారెస్ట్ సిబ్బంది అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. నేరం రుజువు కావడంతో జడ్జి అతనికి శిక్ష విధించారు.
ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు
సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలంలోని తుమ్మలతలుపూరు గ్రామంలో శ్రీగంగోడు నాగేశ్వరరావు కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పెరుమాళ్లపాడు రెవెన్యూ పరిఽధిలోని సర్వే నం. 142,143ఎలో 3.197 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్టు వెల్లడించారు. ఎన్విరాల్‌మెంట్ అధికారి అశోక్‌కుమార్, తహసీల్దార్ సుభద్ర పాల్గొన్నారు.
ఆలయంలో అపచారం
వరదయ్యపాళెం: మండలంలోని సాధనవారిపాళెం గ్రామంలోని పుట్టాలమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు భక్తులు పూజించే పవిత్ర చెట్టును నరికివేసి, ఆలయంలోని త్రిశూలం, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఘటనను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆలయ ధర్మకర్త హేమలతమ్మ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ సత్యవేడు ఖండ సహ కన్వీనర్ ఆర్. మురళి, ధర్మ ప్రచారక్ తోట హనుమంతురెడ్డి, మండల కన్వీనర్ సురేష్, సహ కన్వీనర్ ఆర్కే శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
తడ–నెల్లూరు మధ్య ఆరు లేన్లు
తిరుపతి అర్బన్: తడ–నెల్లూరు జాతీయ రహదారిని 4 లేన్ల నుంచి ఆరు లేన్లుగా చేస్తున్నారని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణ, ట్రాపిక్ సర్వేలు తదితర అంశాలపై చర్చించారు. జేసీ గోవిందరావు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ గణపతి పాల్గొన్నారు.


