తిరుపతి కల్చరల్: పోలీస్ స్టేషన్‌లో నిందితుడ్ని చంపే హక్కు పోలీసులకు ఉందా.. అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ కృష్ణలంకలో లాకప్ డెత్‌పై సుదీర్ఘంగా మాట్లాడారు. నిందితుడు గాదే సాయికృష్ణ హత్య దారుణమన్నారు. అతడిని చిత్రహింసలు పెట్టి, మర్మాంగాలపై తన్ని, గోళ్లు పీకి జంతువులు కన్నా ఘోరంగా హింసించి చంపేయడం దుర్మార్గమన్నారు. ‘నా బిడ్డ బూడిదన్నా ఇవ్వండి’ అంటే ఇవ్వకుండా అతని తల్లిని వేధిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులలో సుమారు 20 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. పోలీస్ కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లో చంపే హక్కు పోలీసులకి ఎక్కడదని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా నిరాహార దీక్ష చేస్తే పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దీనికి నిరసనగా శనివారం 9 గంటలకు తిరుపతిలోని అనంత వీధి నుంచి గాంధీ రోడ్డు హథిరాంజీ మఠం వరకు మానవ హక్కుల పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం లక్కాకుల దినేష్ రాయల్ మాట్లాడారు. సమావేశంలో డాక్టర్ రమేష్ రాయల్, తిరుమల శెట్టి వెంకటేష్, లక్కాకుల దినేష్ రాయల్, ఎన్‌వీ సురేష్, నైనారు మధుబాల, శేఖర్ పాల్గొన్నారు.


