కాపులను ఉద్ధరించడం ఇలాగేనా పవన్‌? | - | Sakshi
Sakshi News home page

కాపులను ఉద్ధరించడం ఇలాగేనా పవన్‌?

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

● కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చి కాపులకే వెన్నుపోటు ● కూటమి పాలనలో కాపులకు రక్షణ కరువు ● సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని రిలే నిరాహారదీక్ష ● తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం

తిరుపతి మంగళం : ‘కాపులే నా ఊపిరి.. కాపులే నా ప్రాణం.. కాపులే నాకు అండ.. కాపులే నా ధైర్యం.. మా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే కాపులను ఉద్దరిస్తా.. కాపులను అత్యున్నత స్థానంలో ఉంచుతా.. అంటూ సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి రాగానే కాపులపై దాడులు జరుగుతున్నా, లాకప్‌ డెత్‌లు చేస్తున్నా పట్టించుకోని డిప్యూటి సీఎం పవన్‌కళ్యాన్‌ కాపులను ఉద్ధరించడం ఇలాగేనా?’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో కాపు నాయకుడు సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై తిరుపతిలోని కాపు నాయకులతో పాటు భూమన అభినయ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దాంతో బుధవారం తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాపు నాయకులతో కలిసి రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, వారి కుటుంబ సభ్యులకు న్యాయ చేయాలంటూ నినదించారు. అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని రిలే నిరాహారదీక్షకు అనుమతి లేదంటూ అభినయ్‌రెడ్డితో కాపు నాయకులతో వాగ్వివాదానికి దిగారు. అక్కడ నుంచి ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. అయితే సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రిలే నిరాహార దీక్ష ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో కూర్చుని రెడ్‌బుక్‌ రాజ్యాంగం నశించాలి, కూటమి అరాచక పాలనను తరిమికొట్టాలి, కాపు నేత అని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌ రాజీనామా చేయాలి, హోంమంత్రి అనిత రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఉన్నతంగా ఎదగడానికి, ఫ్యాకేజీలు తీసుకోవడానికి రాష్ట్రంలో కాపులను పవన్‌కళ్యాణ్‌ వాడుకున్నంతగా మరెవరూ వాడుకోలేదన్నారు. కాపులను వాడడం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లుగా కాపులమని చెప్పుకుని కాపు ఓట్లు దండుకుని కాపులకు వెన్నుపోటు పొడవడంలో పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. సాయికృష్ణను లాకప్‌ డెత్‌ చేయడమే కాకుండా శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేశారంటే పోలీసులు ధైర్యమేమిటని ప్రశ్నించారు. సాయికృష్ణ మృతిపై కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు, చివరికి లాకప్‌ డెత్‌లు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇదేనా? అని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటి సీఎంగా పవన్‌కళ్యాణ్‌, హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సాయికృష్ణ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ రిలే దీక్షలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కాపు నాయకులు నీలం బాలాజీ, అనీష్‌రాయల్‌, బెల్లం రమేష్‌, దినేష్‌ రాయల్‌, ఎన్వీ సురేష్‌ రాయల్‌, పసుపులేటి సురేష్‌ రాయల్‌, వెంకటేష్‌ రాయల్‌, మద్దాలి శేఖర్‌, నయనారు మధుబాల, శారద, గోలి విజయలక్ష్మి, పద్మజ, పార్టీ నాయకులు బత్తల గీతాయాదవ్‌, ఉదయ్‌వంశీ, వాసుయాదవ్‌, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement