శ్రీవారి దర్శనానికి 15 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 86,601 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌

రేపు జిల్లాకు రాక

తిరుపతి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ కోటాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ జిల్లాకు శుక్రవారం రానుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ చాంబర్‌లో శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబందించి మీ అభిప్రాయాలను అర్జీల రూపంలో కమిషన్‌కు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతారన్నారు.

నేడు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

తిరుపతి సిటీ: గత నెల 21 నుంచి ఈనెల 5వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34,380 మంది ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు రికార్డు స్థాయిలో ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. అలాగే మరో రెండు రోజుల వ్యవధిలో ఏపీఈఏపీసెట్‌–2026 ఫలితాలను సైతం విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈఏపీసెట్‌ ర్యాంక్‌ ప్రక్రియలో 25శాతం ఇంటర్‌ మార్కులను వెయిటేజ్‌గా పరిగణించనున్న నేపథ్యంలో సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన వెంటనే ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.

ప్రతిష్టాత్మకంగా జలధార–జలహారతి

నాయుడుపేట టౌన్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. నాయుడుపేట మండలం సమీపంలోని పాలచ్చూరు క్యాస్కేడింగ్‌ సిస్టమ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుంటూ చెరువులు, కాలువలు, నీటి వనరులను పునరుద్ధరించడంతో భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,360 జలధార– జలహారతి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం నాయుడుపేట – వెంకటగిరికి సంబంధించి ఏపీఐఐసీ ద్వారా తిమ్మాజికండ్రిగ నుంచి పండ్లూరు వరకు రూ.120 కోట్ల ఏడీబీ నిధులతో జరిగే రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. డ్వామా పీడీ మద్దిలేటి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాధకృష్ణ, ఏపీఐఐసీ జెడ్‌ఎం భరత్‌కుమార్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ పరమేశ్వరి పాల్గొన్నారు.

ఏసీబీ దర్యాప్తు చేయాలి

తిరుపతి సిటీ: ఎస్వీయూలో రిజిస్ట్రార్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపైన వెంటనే ప్రభుత్వం జో క్యం చేసుకుని ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రార్‌ చేస్తున్న అధికార దుర్వినియోగం, పరిపాలనలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీలలో ఆ యన జోక్యంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి సంఘాల నేతలను కులం పేరుతో దూషించడం, అధ్యాపకులను ఇష్టానుసారంగా వేధించడం ఆయనకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement