ప్రాణాలు పణం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పణం

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

జిల్లాలో 1200కు పైగా విద్యాసంస్థల బస్సులు

అందులో ఎన్ని ఫిట్‌నెస్‌, ఎన్ని ఫిట్‌లెస్‌ తెలియని పరిస్థితి

ఫిట్‌నెస్‌ పరీక్ష ప్రైవేటుకు ఇవ్వడంతో అమోమయంలో రవాణాశాఖ అధికారులు

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం

చెలగాటం

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న

విద్యార్థులు తల్లిదండ్రులు

భద్రత కనం..
ఏటా ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల సామర్థ్య పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. మసిపూసి, మారెడు కాయ చేసిన చందంగా ముస్తాబు చేసిన డొక్కు బస్సులకు ఏటీఎస్‌ ప్రతినిధులు ఎఫ్‌సీలు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వాటిలో ప్రయాణించే చిన్నారుల ప్రాణాలు పణంగా పెట్టాల్సివస్తోంది.

తిరుపతి మంగళం : ఫిట్‌నెస్‌ లేని చాలా బస్సులు బడి పిల్లలను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నప్పటికీ బడి బస్సుల్లో భద్రత కొరవడింది. ఇంత జరుగుతున్నా పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వీడడంలేదు. రవాణాశాఖ అధికారులు నిత్యం రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నా యాజమాన్యంలో మార్పు రావడం లేదు. సాధారణంగా స్కూళ్లు తెరిచేనాటికే యాజమాన్యాలు బస్సులను కండిషన్‌లో ఉంచుకోవాలి. డ్రైవర్ల అనుభవం, నైపుణ్యం వంటి అంశాలను సీరియస్‌గా పరిగణించాలి. కానీ ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలకు ఇవేవీ పట్టవు. దీంతో వందలాది బస్సులు సామర్థ్యం లేకపోయినా రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ తిరుగుతున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలో 1200కు పైగా పాఠశాలలు, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో ఎన్ని ఫిట్‌నెస్‌, ఎన్ని ఫిట్‌లెస్‌ తెలియని పరిస్థితి.

కాలం చెల్లిన బస్సులకు ఫిట్‌నెస్‌?

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు రవాణాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల కాలం చెల్లిన బస్సులకు రంగులు వేసి, రోడ్లపై తిప్పుతున్నారు. అలాంటి బస్సులు రవాణాశాఖ లెక్కల్లోనే ఉండవు. ఉన్న వాటిల్లో ఒకటి, రెండు బస్సులకు ఫిట్‌నెస్‌ తీసు కుని వాటిని తిప్పుతూ అవసరం వచ్చినప్పుడు కాలం చెల్లిన బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నారు.

ఏటీఎస్‌ల్లో అక్రమ వసూళ్లు

ఇటీవల రవాణాశాఖ అధికారులు తనిఖీలు కఠినతరం చేసినప్పటికీ ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌(ఏటీఎస్‌) వద్ద అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల్లో లోపాలు ఉన్నప్పటికీ ఏటీఎస్‌ అధికారిక ఫీజులకు అదనంగా వసూలు చేసి ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. అదనపు మొత్తం చెల్లించని వాహనాలను రిజెక్ట్‌ చేసి మరమ్మతులు చేయించుకుని రావాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. రెండో సారి పరీక్షలకు వస్తే సమయం, డబ్బు వృథా అవుతుందనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించి ఫిట్‌నెస్‌ పొందుతున్నామని వాహన యజమానులు వాపోతున్నారు. అధిక వసూళ్లు కారణంగా విద్యా సంస్థల బస్సులను ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు పంపించకుండా కాలం వెల్లబుచ్చుతున్నారని తెలుస్తుంది.

నిబంధనలకు తూట్లు

కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అనుభవం లేని డ్రైవర్లతో పాటు ఉద్యోగ విరమణ పొందిన డ్రైవర్లను కూడా బస్సులు నడిపేందుకు నియ మిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ వేతనాలతో డ్రైవర్లను నియమించుకోవచ్చనే ఉద్దేశంతో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కండిషన్‌ లేకుంటే ఫిట్‌నెస్‌ ఇచ్చేవాళ్లం కాదు

ఏ వాహనాలైనా కండిషన్‌లో లేకుంటే ఫిట్‌నెస్‌ సర్టి ఫికెట్‌ ఇచ్చే ప్రసక్తే ఉండదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సులకై తే ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవాళ్లం. ఫిట్‌నెస్‌ బాధ్యతను ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎస్‌)కు ఇచ్చిన తర్వాత పాఠశాలలు, కళాశాలల బస్సులు ఎన్ని ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు పొందారన్న సమాచారం కూడా రవాణాశాఖకు తెలియని పరిస్థితి. తాము నిత్యం తనిఖీ అధికారుల బృందాలతో పర్యవేక్షిస్తున్నా పాఠశాలల యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్లు. ఇప్పుడు రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తే తప్ప బస్సుల ఫిట్‌నెస్‌ తెలియని పరిస్థితి. – కొర్రపాటి మురళీమోహన్‌,

జిల్లా రవాణాశాఖాధికారి

వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ ప్రైవేటుపరం

వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లను(ఏటీఎస్‌లు) చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రత అంశాన్ని రవాణాశాఖను ప్రత్యక్ష పర్యవేక్షణ నుంచి దూరం చేసి, ప్రైవేటు యాజమాన్యాలపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో ఫిట్‌నెస్‌ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు వస్తున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారే తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి వారిది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాలు, స్వలాభాల కోసం చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామర్థ్యం లేకుండానే రోడ్లపై రయ్‌ రయ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement