తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గోడౌన్లలో విద్యుత్ పరికరాల నిర్వహణ కీలకమని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నెల్లూరు సర్కిల్ పరిధిలోని గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు షెడ్లను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్‌ను స్మార్ట్ స్టోర్‌గా రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోర్‌లోని ఏబీ కేబుల్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్సులేటర్లు, బ్రేకర్లు, క్యూబికల్స్, ఎర్త్ పైప్స్, కండక్టర్ తదితర పరికరాలను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
టెండర్లతో పాత పరికరాల విక్రయం
స్టోర్స్‌లో ఉన్న వివిధ పాత పరికరాలను టెండరు ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పరికరాల నిర్వహణకు రెండు నెలల్లోగా ప్లాట్ ఫామ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక స్టోర్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూడూరు డివిజనల్ కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు.


