యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలంటే ఉన్నత విద్యామండలికి లెక్కలేదు. ప్రవేశ పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా.. కొన్ని ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేయకపోగా, మరికొన్ని సెట్ల కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో అ | - | Sakshi
Sakshi News home page

యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలంటే ఉన్నత విద్యామండలికి లెక్కలేదు. ప్రవేశ పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా.. కొన్ని ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేయకపోగా, మరికొన్ని సెట్ల కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో అ

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఊసేఎత్తని ఉన్నత విద్యామండలి

అడ్మిషన్ల కోసం విద్యార్థుల ఎదురుచూపు

మండిపడుతున్న తల్లిదండ్రులు

ప్రవేశాల సంగతేమిటి?

తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనా డిగ్రీ, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు ఏమి చేయాలో పాలుపోని స్థితి నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు పీజీ, యూజీ సెట్‌ల ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌, మేలో నిర్వహించారు. దాదాపు అన్ని పీజీ, యూజీ సెట్‌ల ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పీజీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియకు తేదీలు సైతం ప్రకటించిన పాపాన పోలేదు. మరికొన్ని పీజీసెట్లకు కౌన్సెలింగ్‌ అధికారులను సైతం ఇప్పటివరకు నియమించిన దాఖలాలు లేవు. జూలై నెల ప్రారంభమైనా కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

సందిగ్ధంలో తల్లిదండ్రులు

పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయం చెందుతున్నారు. కౌన్సెలింగ్‌లో పిల్లలకు సీటు దక్కకపోతే ఏమి చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో పడ్డారు. ఇటు ప్రభుత్వ సంస్థల్లో సీటు దక్కక, అటు ప్రైవేటు సంస్థల్లో సీటు దొరకని పరిస్థితిలో ఏమి చేయాలనే అయోమయంతో ఉన్నారు. దీంతో ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో టోకన్‌ అమౌంట్‌ చెల్లించి, సీటు రిజర్వ్‌ చేసుకుంటున్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

పలు పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టకపోవడం దారుణం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పలు పీజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ప్రవేశాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడ్మిషన్లపై తీవ్రప్రభావం

వర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలో పీజీ, యూజీ ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేయడమే. ఉన్నత విద్యామండలి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలనే కుట్రతో ఇలా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నదనే అనుమానం కలుగుతోంది. ఇలాంటి కుఠిల చర్యలతో యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తగ్గి పలు కోర్సులకు చరమగీతం పాడుతున్నారు. దీంతో వర్సిటీల భవిష్యత్తు ఆందోళన స్థితికి చేరుతోందని మేధావులు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమకు సీటు రాదనే సందిగ్దంతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియను విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే చేపడితే ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని వారు ఆరోపిస్తున్నారు.

యూజీ, పీజీ ప్రవేశాలపై అలసత్వం

పలు పీజీ, యూజీ–2026 సెట్ల వివరాలు

ప్రవేశ పరీక్ష పరీక్ష జరిగిన తేదీ ఫలితాలు విడుదల కౌన్సెలింగ్‌ తేదీ

ఏపీ పాలీసెట్‌ ఏప్రిల్‌ 25 మే 5 ఊసేలేదు

ఏపీ ఐసెట్‌ మే 2 మే 16 ఊసేలేదు

ఏపీ లాసెట్‌ మే 4 మే 18 ప్రకటించలేదు

ఏపీపీజీఈసెట్‌ ఏప్రిల్‌ 28–30 మే 14 ప్రకటించలేదు

ఏపీపీజీసెట్‌ మే 8–11 మే 29 కౌన్సెలింగ్‌ ఊసేలేదు

ఏపీఈఏపీసెట్‌ మే 12–19 విడుదల కాలేదు –

ఏపీఎడ్‌సెట్‌ మే 8 మే 26 ప్రస్తావనే లేదు

ఏపీఈసెట్‌ ఏప్రిల్‌ 23 మే 8 తేదీలు ప్రకటించలేదు

ఇంటర్‌ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశాలు లేవు.

కౌన్సెలింగ్‌కు విద్యార్థుల ఎదురుచూపు

తిరుపతి జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు సుమారు 75 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ పాలిసెట్‌, ఏపీ ఐసెట్‌, ఏపీ లాసెట్‌, ఏపీపీజీఈసెట్‌, ఏపీఈసెట్‌, ఏపీపీజీసెట్‌, ఏపీఎడ్‌సెట్‌ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదలై కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం. దీనికితోడు ఇంటర్‌ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌ అధికారులను సైతం నియమించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement