తిరుపతి అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను వేగవంతంగా గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సర్ కార్యక్రమంపై జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొన్ని బూత్‌ల్లో ఆశించిన స్థాయిలో మ్యాపింగ్ పురోగతి లేకపోవడం సరికాదన్నారు. వెనుకబడిన అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో పొరబాట్లు, నకిలీ నమోదులు, అర్హత లేని పేర్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్, ఇంటింటా సర్వే, డేటా నవీకరణ గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు. ఆర్టీఓలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌నాయక్, రోజ్‌మాండ్, ఎన్నికల సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


