తిరుపతి అర్బన్: జిల్లాలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌తో కలసి పల్స్‌పోలియో కార్యక్రమానికి చెందిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్‌లతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ, పాఠశాలల్లో అర్హులైన పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1937 పల్స్‌పోలియో కేంద్రాలు, 84 మొబైల్ కేంద్రాలు, 57 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోవు 2,59,843 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శాంతకుమారి, ఆనందమూర్తి, డీఈఓ కేవీఎన్ కుమార్,ఐసీడీఎస్ పీడీ వసంతబాయి పాల్గొన్నారు.


