పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పనులు వేగవంతం చేయండి

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

తిరుపతి అర్బన్‌: రైల్వే, రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంశాలపై జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి వారం పనితీరులో పురోగతి చూపాలన్నారు. అలాగే ముందు వారంలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే వారంలో అమలు చేయాల్సి ఉందని చెప్పారు. రోడ్డు రహదారులు, రైల్వే, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. వడమాలపేట పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లంలో టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇంటిపట్టాల అంశాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్‌, సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌ నాయక్‌, రోజ్‌మాండ్‌, ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌ అధికారి రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తిరుమల : ఒంగోలుకు చెందిన విజన్‌ ఆటోమొబైల్స్‌ సంస్థ అధినేత మంగళవారం టీటీడీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.

ఎంపిడీఓ సస్పెన్షన్‌

సూళ్లూరుపేట రూరల్‌: మండలకేంద్రంలోని ఎంపీడీఓగా పనిచేస్తున్న మురళిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు అందాయి. స్వచ్ఛరథం వాహనాన్ని తడ, సూళ్లూరుపేట మండలాలకు ఒకే వాహనాన్ని తిప్పినందుకు ఇటీవల తెలియడంతో ఉన్నత అధికారులు దీనిపై విచారించారు. ఆరు రోజుల నుంచి దీనిపై సంబంధిత అధికారులు పరిశీలించి పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ నివేదికలు అందజేశారు. ఒకే వాహనం తిప్పినట్లు సమాచారం ఉండడంతో ఎంపీడీఓను సస్పెండ్‌ చేస్తునట్లు ఉత్తర్వు జారీ చేశారు.

లైంగిక దాడి కేసులో

నిందితుడి అరెస్టు

తిరుపతి రూరల్‌: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం ఉప్పరపల్లికి చెందిన గోపీచంద్‌కు ఇప్పటికే వివాహమైనప్పటికీ మరో బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్‌ డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

రాపూరు: ఓబులవారిపల్లి–కృష్ణపట్నం పోర్టు రైల్వే మార్గం మధ్యలోని రాపూరు సమీపంలో గుర్తు తెలియని సుమారు 25 ఏళ్ల యువకుడు మంగళవారం గూడ్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ హరిచందన తెలిపారు. ఇతను కాఫీ కలర్‌షర్ట్‌, గ్రేకలర్‌ ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడని, ఇతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆమె తెలిపారు. రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం

రేణిగుంట: మండలంలోని మామండూరు– కుక్కలదొడ్డి మధ్య కడప రహదారిలో మంగళవారం స్క్రాప్‌ లోడ్‌తో చైన్నె నుంచి ముంబయి వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. మంటలను గమనించి డ్రైవర్‌, క్లీనర్‌ ముందుగానే లారీ నుంచి దిగి దూరంగా వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్‌ ఇంజిన్‌ మంటలను అదుపులోకి తెచ్చింది. రేణిగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చేశారు.

వేధింపులపై విచారణ

తిరుపతి సిటీ: ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌పై అదే కళాశాలకు చెందిన ఓ మహిళా అధ్యాపకురాలు తనను వేధిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌, స్టేట్‌ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, విజయవాడ నుంచి విచ్చేసిన స్టేట్‌ మహిళా కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం విచారణ చేపట్టింది. ఫిర్యాదు చేసిన మహిళా అధ్యాపకురాలితో పాటు కళాశాలలోని పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఈ విషయంపై ఆరా తీశారు. కొందరు అధ్యాపకులు, సిబ్బంది విచారణ కమిటీకి, టీటీడీ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించినట్లు సమాచారం. అనంతరం ప్రిన్సిపల్‌ను టీటీడీ పరిపాలనా భవనంలో మహిళా కమిషన్‌ బృందంతో పాటు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement