గత ఏడాదితో పోల్చితే 30 శాతం అదనపు ఫీజు వసూలు యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ పేరుతో అదనపు దోపిడీ అమలుకాని ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని విద్యాశాఖాధికారులు
ప్రైవేటు, కార్పొరేట్ ఫీజులు సామాన్యుడిని భయపెట్టేస్తున్నాయి. పేద, మధ్య తరగతి పిల్లలు కోరుకున్న పాఠశాలల్లో చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా పోతోంది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని జలగల్లా ఫీజులం ప్రదర్శిస్తున్నారు. కఠిన నిబంధనలున్నా కార్పొ‘రేట్’ దాటికి అవి విలవిల్లాడుతున్నాయి. ఇదీ నేడు ప్రైవేటు పాఠశాలల్లో చదువుల దుస్థితి.
తిరుపతి అర్బన్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 30 శాతం అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆకర్షణీయమైన పేర్లతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు, ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారు. యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ పేరుతో అదనపు దోపిడీ కొనసాగుతోంది. విద్యాకేంద్రాలు వ్యాపారకేంద్రాలుగా మారిపోతున్నా విద్యాశాఖా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంతో వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తిరుపతిలో చిన్నపాటి పాఠశాలల్లో గత ఏడాది ఎల్‌కేజీకి రూ.18 వేలు ఉంటే ఈ ఏడాది రూ.25 వేలకు పెంచేశారు. అలాగే మూడో తరగతికి రూ.26 వేలు నుంచి రూ.30 వేలకు పెంచడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆరో తరగతికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నారు. పదో తరగతి చదివించాలంటే రూ.లక్ష ఖర్చు చేయాల్సిందేనని చర్చసాగుతోంది. మరోవైపు పుస్తకాలు, యూనిఫామ్, లైబ్రరీ, పరీక్ష ఫీజులంటూ ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో రూ.8 వేలు నుంచి రూ.10 వేలు గుంజుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. హైస్కూల్ స్థాయిలో అయితే రెట్టింపు ధరలు ఉన్నాయనని ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ స్కూల్స్ బస్సు చార్జీలను రెట్టింపు చేయడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఫీజు దోపిడీ జరుగుతున్నా, వసతులు అంతంత మాత్రమే ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరోవైపు అన్‌క్వాలిఫైడ్ టీచర్లతో బోధన సాగిస్తున్నారు.
ప్రైవేటులో ఫీజు దోపిడీ


