తిరుపతి మంగళం : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు ఉల్లంఘించి నడిపితే సీజ్ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పరిధిలో మంగళవారం అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలకత్తా నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఒక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సును తనిఖీ చేయగా, సంబంధిత వాహనం ఆల్ ఇండియా పర్మిట్ పన్ను చెల్లించకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో మోటారు వాహన తనిఖీ అధికారి మోహన్ కుమార్ వాహన తనిఖీ రసీదు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంపై పన్ను, అపరాధ రుసుము కలిపి రూ.5.20 లక్షలు చెల్లించాలని చెప్పారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాలపై పలు కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లా పరిధిలో 30 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.5 లక్షలు జరిమానా విధించారు. అలాగే హైదరాబాదు నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనం నిర్దేశిత వేగ పరిమితిని మించి నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్ రూమ్ నిర్వహించిన సాంకేతిక పర్యవేక్షణలో గుర్తించారు. ఈ సమాచారంతో సంబంధిత వాహనాన్ని తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో అతివేగంగా వెళ్తున్న 10 వాహనాలపై కేసులు నమోదు చేశామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్‌కుమార్, అతికానాజ్, రమణ నాయక్, ప్రసాద్ వర్మ పాల్గొన్నారు.


