తిరుపతి మంగళం : కూటమి అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికారిక పేజీనే నిలిపివేసిన దుర్మార్గపు ప్రభుత్వం కూటమి సర్కారు అని ఆ పార్టీ ఎస్సీసెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బయట పడుతున్న కుళ్లిన మాంసంతో కూడా టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఎస్సీ వర్గానికి చెందిన తలారి రాజేంద్రకు కుళ్లిన మాంసం విక్రయాలను అంటగడుతూ టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడంపై మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని రాజేంద్ర డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో సీఐ రామ్‌కిషోర్‌కు తలారి రాజేంద్రతో పాటు పార్టీ నాయకులు వాసుయాదవ్, కోటూరు ఆంజేనేయులు, నల్లాని బాబు, కృష్ణమూర్తి, కోటి, మురళి ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలోనే కూటమి నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కుళ్లిన మాంస విక్రయాలు సాగుతున్నాయన్నారు. వాటిని కూడా రాజకీయాలు చేయడానికి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సిగ్గుచేటని రాజేంద్ర మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో చిన్నపాటి పోస్టులు పెట్టిన వెంటనే అక్రమ కేసులు బనాయించి టెర్రరిస్టులకు ముసుగులు వేసినట్లు వేసి నిందితులుగా నిలబెట్టిన పోలీసులు తమ పరువుకు భంగం కలిగించిన టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా కేసుల నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తానని చెప్పారు.


