మంకుపట్టు.. తల బొప్పికట్టు | - | Sakshi
Sakshi News home page

మంకుపట్టు.. తల బొప్పికట్టు

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ఆ గ్రూపులే.. కావాలి సారూ! ముగిసిన ఇంటర్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ మొదటి విడతలో అడ్మిషన్లు పొందిన మంది 426 మంది విద్యార్థులు రేపు రెండో విడత సీట్ల కేటాయింపు.. 18నుంచి కౌన్సిలింగ్‌

తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్‌ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు తమకు ఆంగ్లమాద్యమం ఎంపీసీ, బైపీసీ గ్రూపులే కావాలని పట్టుపట్టారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక అధికారులు తలలుపట్టుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలల్లో 1,750 సీట్లకు గాను 426 మంది ప్రవేశాలు పొందారు. ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 792 సీట్లకు గాను 172 మంది ప్రవేశాలు పొందగా, పద్మావతి జూనియర్‌ కళాశాలలో 968 సీట్లకు గాను 254 మంది అడ్మిషన్లు పొందారు. అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన ప్రతి విద్యార్థీ ఎంపీసీ, బైపీసీ ఇంగ్లిష్‌ మీడియం గ్రూపుల వైపే మొగ్గు చూపడంతో అధికారులు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు రాయలసీమలోని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లెటర్లు, ఫోన్‌కాల్స్‌ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం.

ఆ గ్రూపుల వైపే విద్యార్థుల మొగ్గు

తొలి విడత కౌన్సెలింగ్‌లో రెండు కళాశాలల్లో అడ్మిషన్లు మందకొడిగా కొనసాగుతుంటం గమనార్హం. రెండు కళాశాలలకు కలిపి 46 వేల వరకు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో తొలివిడత కౌన్సెలింగ్‌లోనే 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని అధికారులు భావించారు. కానీ కనీసం 24 శాతం సీట్లు భర్తీ కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్త మవుతోంది. కాగా తొలివిడతలో ఎక్కువ మంది విద్యార్థులు స్లైడింగ్‌ (గ్రూపు మార్పు) పెట్టుకోవడం కారణంగానే ప్రవేశాల్లో తేడా కనిపిస్తోందని తెలుస్తోంది. అలాగే తొలివిడతలో సీట్లు పొందిన 70 శాతం మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ వైపు మొగ్గు చూపడంతో తొలివిడత ప్రవేశాలు ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం.

రేపు రెండో విడత సీట్ల కేటాయింపు

ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల్లో భాగంగా రెండో విడత మెరిట్‌ లిస్టును సోమవారం టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అదే రోజు సీట్లు పొందిన విద్యార్థుల సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టారు. సీట్లు పొందిన విద్యార్థులు 18, 19, 20 తేదీల్లో జరిగే రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందాలని అధికారులు తెలిపారు. స్లైడింగ్‌ పెట్టుకున్న విద్యార్థులు సైతం సోమవారం విడుదల చేసే రెండో విడత మెరిట్‌ లిస్టును ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement