తొండవాడ పంచాయతీలో ప్రభుత్వ భూమి కబ్జా | - | Sakshi
Sakshi News home page

తొండవాడ పంచాయతీలో ప్రభుత్వ భూమి కబ్జా

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

తిరుపతి రూరల్‌: చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు మోహన్‌రెడ్డి అలియాస్‌ బుజ్జిరెడ్డి కబ్జా చేశారని బుచ్చినాయుడుపల్లికి చెందిన మహిళా రైతు రాణెమ్మ శనివారం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి రెవెన్యూ పరిధిలో తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేత బుజ్జిరెడ్డి ఆక్రమించి అరుణ కాలనీకి చెందిన తన అనుచరుడు బాలకు అప్పగించారని ఆమె ఆరోపించారు. తన తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమిపై హక్కు కోసం పలుమార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆ మహిళా రైతు ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.లక్షల ధరలు పలికే ఆ భూమిని కాజేస్తున్నారన్నారు. టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన అనుభవంలోని భూమిని కాజేస్తున్న కబ్జాదారుల నుంచి తన భూమిని రక్షించి న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నారు. మహిళా రైతు కన్నీటి పర్యంతమవుతూ తన గోడును అధికారులకు వివరించగా, ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement