టీటీడీకి ట్రక్కు బహూకరణ | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి ట్రక్కు బహూకరణ

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

తిరుమల: ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును బహూకరించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ కుమార్‌ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు చేసి, టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. టీటీడీ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌చార్జి జీఎం లక్ష్మీప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.

విజయవంతంగా

గుండె మార్పిడి

తిరుపతి తుడా: టీటీడీ శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లో శనివారం గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతపురం జిల్లా గూటి మండలానికి చెందిన 28 ఏళ్ల యువతికి నెల్లూరు జిల్లా దర్గామిట్టకు చెందిన 24 సంవత్సరాల యువకుడి గుండెను వైద్యులు సుమారు 6 గంటల పాటు శ్రమించి అమర్చారు. యువతి కొన్ని నెలలుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె పూర్తిగా క్షీణించిందని, గుండె మార్పిడి అనివార్యమని పద్మావతి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నెల్లూరుకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యులు నెల్లూరు కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి గుండెను సేకరించారు. సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రారంభమై 5.38 గంటలకు టీటీడీ అంబులెన్స్‌లో పద్మావతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం వైద్యుల బృందం సుదీర్ఘంగా గుండె మార్పిడి చికిత్సను నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement