తిరుపతి తుడా: నెల రోజులుగా వరుణుడు ఊరిస్తూ వచ్చాడు.. ఇదిగో అదిగో అంటూ కారు మబ్బు లతో దోబూచులాడాడు.. అప్పుడప్పుడు నాలుగు చినుకులు పడడం.. రెడ్డింపు స్థాయిలో ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయడం పరిపాటిగా ఉండేది.. అయితే ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు.. ఉపశమనం తీసుకొచ్చాడు.. దీంతో ప్రజలు సేదతీరుతూ పులకించారు. శుక్రవారం మధ్యా హ్నం తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మోస్తారు నుంచి అక్కడక్కడ కుండపోత వర్షం నమోదైంది. సుమారు రెండు గంటలకు పైగా వర్షం పడడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గడిచిన మూడు నెలలుగా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లి పోయారు. వేడి గాలులు అధిక ఉక్కపోతతో ఊపిరి పీల్చుకోలేని వాతావరణంలో గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఈసారి ప్రజల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. కుండపోత వర్షంతో వారావరణంలో కొంత మార్పులు చోటు చేసుకోవడంతో తిరుపతి నగరం చల్లబడింది. వర్షపు నీరు ఏరులై ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
కూలిన చెట్టు.. ఆగిన ట్రాఫిక్..
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి వద్ద నడిరోడ్డుపై ఓ చెట్టు నేల కూలింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం, పెనుగాలులకు చెట్టు విరిగి పడడంతో తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల ద్వారా ఆ చెట్టును తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రాకపోకలు యథావిధిగా సాగేలా చర్యలు తీసుకున్నారు.


