సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట మండలంలో పనికుదిరి గ్రామం సమీపంలోని పులికాట్ వ్యూ పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం స్థానికులు రోడ్డు పక్కన ప్యూ పాయింట్ వద్ద మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ అజయ్‌కుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వయస్సు 50 ఏళ్లు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి యాచకుడిగా గుర్తించారు. అంగవైకల్యం ఉందని నడిచే అలువాటు ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి వేళ్లలో దుండగులు పథకం ప్రకారం ఆతని తలపై రాయితో బలంగా కొట్టడంతోపాటు, పొట్టపై కత్తితో పొడిచినట్లు గాయాలను పోలీసులు గుర్తించారు. ఈ కేసును నాయుడుపేట ఇన్‌చార్జి సీఐ సంగమేశ్వరరావు పరివేక్షిస్తున్నారు. క్లూస్ టీం ద్వారా కేసు దర్యాప్తు చేసి, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
నిమ్మ చెట్లు, కంచె దగ్ధం
సైదాపురం: మండలంలోని మొలకలపూండ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల కు చెందిన నిమ్మ చెట్లు, పొలం కంచె దగ్ధమైంది. బాధితుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని మొలకలపూండ్ల గ్రామానికి చెందిన కూకటి లక్ష్మీనారాయణకు చెందిన 70 నిమ్మ చెట్లుతోపాటు విద్యుత్ మోటార్లు, వైర్లు దగ్ధమయ్యాయి. అలాగే అడుసుమల్లా వెంకటరమణయ్య, సరుపూరు పుల్లయ్యకు చెందిన పొలం కంచె కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాఽధితులు తెలిపారు.
ఎర్రచందనం కేసులో
ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, ఎస్‌వీఎన్‌పీ చామల రేంజ్, కేఎంఎం కళాశాల సమీపంలోని అడవిలో తనిఖీలు చేశారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, పడిమలై గ్రామానికి చెందిన అప్పస్వామి, కాశి అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
త్వరలో ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తాం
తిరుపతి అర్బన్: టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలకు సంబంధించి అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. ఇంటిపట్టాల సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జేసీ గోవిందరావు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డితో కలసి సమీక్షించారు. వడమాలపేట మండలంలోని పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లం గ్రామంలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాల సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.


