చంద్రగిరి: తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభ ప్రాంగణంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఫ్లెక్సీలు కూలిపోయాయి. అయితే ఎవరికీ ఏమీ జరగలేదు. విజయోత్సవ సభ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భారీ వర్షం కురవడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. తమ వాహనాల వద్దకు చేరుకోవడానికి తంటాలు పడ్డారు. భారీ ఈదురు గాలులు వీయడంతో సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేలకూలాయి. ఆ సమయంలో ప్రజలు రోడ్డుపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సభలో భోజన కష్టాలు
ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావడంతో శుక్రవారం దామినేడు సమీపంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు వద్ద ప్రజలు నరకయాతన పడ్డారు. భోజనం చేసేందుకు వెళ్లిన మహిళలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అప్పటికే భోజనం సరిపడనంత లేకపోవడంతో మహిళలు మండిపడ్డారు. చేసేదేమి లేక అక్కడ నుంచి అన్నమో రామచంద్రా అంటూ నిరాశతో వెనుదిరిగారు. సీఎం సభకు రావాల్సిందే అని ఆర్‌పీలు హుకుం జారీ చేశారు.. బలవంతంగా సభకు రప్పించారు.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కనీసం భోజనం కూడా పెట్టలేరా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


