శ్రీకాళహస్తి: పట్టణంలో స్థానిక బ్రాహ్మణ సమాజ కమ్యూనిటీ హాల్ వేదికగా కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలోని పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఆయుర్వేదం, సంస్కృతం తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రక్రియకు శ్రీకాళహస్తి పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ జి. శ్రీనివాసులు, డీన్ వెంకటరమణ పాల్గొని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు, కోర్సుల ఎంపిక, భవిష్యత్తు అవకాశాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌తో పాటు ఆయుర్వేదం, ఎంబీఏ కోర్సులపై ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. విలువల కూడిన విద్యాబోధన విద్యను వ్యాపార దక్పథంతో కాకుండా, భారతీయ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ అందించడమే తమ యూనివర్సిటీ ప్రత్యేకత అని వీసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ అధ్యక్షుడు సింగరాజు ప్రకాశం పాల్గొన్నారు.
గుడిమల్లం ఆలయ ఈఓగా మునిశేఖర్
ఏర్పేడు: గుడిమల్లంలోని ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరాలయం ఈఓగా మునిశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న రామచంద్రారెడ్డి గత నెలాఖరున ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో తిరుపతి దేవాదాయశాఖలో ఉన్న ఈఓ మునిశేఖర్‌ను ఇక్కడకు బదిలీ చేశారు. దీంతో ఆయన గురువారం విధుల్లో చేరారు. ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబును కలసి సమన్వయంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని నెరిణికండ్రిగ సమీపంలోని కేటీరోడ్డు చీటికాలువ వంతెన వద్ద గురువారం అదుపు తప్పి మద్యం తరలిస్తున్న బొలేరో బోల్తా పడింది. రేణిగుంటలోని మద్యం గోడౌన్‌ల నుంచి వరదయ్యపాళెంలోని మద్యం షాపులకు మద్యం బాటిళ్లు తీసుకెళ్లుతున్న బొలేరో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బొలేరోలోని మద్యం బాటిళ్లు పగిలిపోగా, సుమారు రూ. 10 లక్షలు నష్టం వాట్టిల్లినట్లు తెలిసింది.


