పల్లె తడబడి | - | Sakshi
Sakshi News home page

పల్లె తడబడి

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

ఒకటిలో ఒకరు.. రెండులో ఒకరు.. మొత్తం ముగ్గురు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుందనేది పెద్దల మాట. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన సర్కారు విద్యావ్యవస్థ బాబు పాలనలో నిర్వీర్యమవుతోంది. బాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలలకు సవాలుగా మారుతున్నాయి. సర్కారు స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న విద్యామంత్రి మాటలకు క్షేత్రస్థాయిలో పాఠశాలల పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూటమి చర్యలతో విద్యారంగం కునారిల్లుతోంది.

వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు పిల్లలతో ఉపాధ్యాయులు కాలయాపన చేస్తున్నారు. ఆ దిశగా సత్యవేడు మండలంలో చిన్నఈటిపాకం ఈస్ట్‌, రంగనాథపురం, గొల్లపాళెం, పీవీపురం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఆంబాకం ప్రాథమిక తమిళ పాఠశాల పిల్లలు లేక మూతపడింది. అలాగే వరదయ్యపాళెం మండలంలో రామలింగాపురం, సీఎల్‌ఎన్‌పల్లి (హెచ్‌డబ్ల్యూ), తొండూరు (హెచ్‌డబ్ల్యూ), విఠయ్యపాళెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో సైతం ఒకరిద్దరు పిల్లలతో నెట్టుకొస్తున్నారు.

తగ్గుతున్న ప్రభుత్వ పాఠశాలలు

ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయనేందుకు పై పరిస్థితులే నిదర్శనం. ఇందుకు ప్రధాన కారణం విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే. అంతేకాక గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నేడు ఆ పథకానికి స్వస్తి పలికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు పిల్లలు వెనకడుగు వేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రైవేటు స్కూళ్లకు తమ పిల్లలను పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా రానున్న విద్యా సంవత్సరానికి ఒకరిద్దరు పిల్లలతో కొనసాగుతున్న పాఠశాలలు పదుల సంఖ్యలో మూతపడే పరిస్థితులు దాపరించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement