పీజీఆర్‌ఎస్‌కి వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కి వినతుల వెల్లువ

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

తిరుపతి అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. తిరుపతి కలెక్టరేట్‌కు సోమవారం కూడా అర్జీదారులు క్యూకట్టారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 301 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపైనే 176, పోలీస్‌శాఖకు 23, పింఛన్ల కోసం 20, విద్యా సంస్థల సమస్యలపై 15, మున్సిపల్‌ శాఖకు 10. పంచాయతీ రాజ్‌కు 9, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు 5 చొప్పున విభాగాల వారీగా అర్జీలను డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్‌, శివశంకర్‌నాయక్‌, అనురాధ, డిప్యూటీ కలెక్టర్‌ గీతాంజలి అర్జీలను స్వీకరించారు.

వెంకటాపురంలో పశువుల మేత భూమి ఆక్రమణ

రేణిగుంట మండలంలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 270–1లో 94 సెంట్లు, 270–7లో 19 సెంట్లు పశువుల మేతకు చెందిన భూమిని ఆర్‌.అన్నపూర్ణ అనే మహిళ తన పేరున ఆన్‌లైన్‌ చేయించుకోవాలని చూస్తున్నారని స్థానికులు సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని, ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకుంటామని డీఆర్వో వారికి వివరించారు.

99 శాతం వైకల్యం

తమ బిడ్డ ఆదిత్య(13)కు 99శాతం వైకల్యం ఉందని, రెండేళ్లుగా పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చట్టు తిరుగుతున్నా పింఛన్‌ అందలేదని దివ్య, ధర్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు అర్జీ అందజేశారు. కాగా తమ బిడ్డ యశస్వినీ మంచానికే పరిమితం అయ్యిందని ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నందున వైద్యం ఖర్చులు నెలకు రూ.16 వేలకు పైగా అవుతుందన్నారు. తమ బిడ్డకు రూ.15వేలు పింఛన్‌ ఇప్పిస్తే వైద్యం చేయించుకుంటామని వేడుకున్నారు.

మా బడిని మా ఊరిలోనే ఉంచండి

మా ఊరిలోని బడిని మా గ్రామంలోనే ఉంచాలని ఓజిలి మండలం ఎన్‌ఎస్‌ఆర్‌ గిరిజన కాలనీలో వాసులు కోరారు. 200 కుటుంబాలున్న తమ గ్రామంలో అధిక శాతం మంది కూలి పనులు చేసుకుంటున్నామన్నారు. తమ గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది పిల్లలు ఉన్నారన్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మా పాఠశాలలోని 3,4,5 తరగతులను రెండు కిలోమీటర్ల దూరంలోని ఓజిలిలో కలుపుతున్నట్లు తెలిపారన్నారు. రెండు కిలోమీటర్లు చిన్న పిల్లలు వెళ్లిరావడం కష్టమని, మా బడిని మా గ్రామంలోనే ఉంచాలని ఆ గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు అర్జీని అందించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెనుక్కి తీసుకోవాలని లేదంటే దాడి చేస్తామని బెదిరిస్తున్నారంటూ గిరిజన నవ సమాజ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శివశంకర్‌నాయక్‌ వెల్లడించారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement